27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

హైదరాబాద్‌లో విక్రం – 1 ఆర్బిటల్ రాకెట్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . స్కైరూట్‌కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

అంతరిక్ష సాంకేతిక రంగంలో తెలంగాణకు మరొక ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలిచే కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ ప్రైవేటు ఏరోస్పేస్ సంస్థ స్కైరూట్ ఏరోస్పెస్ రూపొందించిన విక్రం-1 ఆర్బిటల్ రాకెట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. విక్రం-1 రాకెట్‌కు సంబంధించిన హార్డ్‌ వేర్‌ను సీఎం ప్రారంభించి, అనంతరం ఈ రాకెట్‌ను సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని ప్రయోగశాలకు తరలించనున్నారు. మామిడిపల్లిలోని జీఎంఆర్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఉన్న స్కైరూట్ మాక్స్-క్యూ డిజైన్ సెంటర్‌లో ఈ రాకెట్‌ను రూపొందించారు. దేశంలో ప్రైవేటు రంగంలో రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్‌గా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది.

 

Vikram-1 orbital rocket launched from Hyderabad

 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్న తెలంగాణ లక్ష్య సాధనలో విక్రం-1 కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. పూర్తిగా హైదరాబాద్‌లోనే అభివృద్ధి చేసిన ఈ రాకెట్ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. స్కైరూట్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన సీఎం, రాకెట్ పనితీరు, సాంకేతిక వివరాలను తెలుసుకున్నారు. సంస్థ బృందం పనితీరును అభినందిస్తూ, 2022లో తొలి ప్రయోగం చేసి తక్కువ సమయంలోనే ఆర్బిటల్ దశకు చేరుకోవడం విశేషమని పేర్కొన్నారు. దేశంలో ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని సీఎం గుర్తుచేశారు. బోయింగ్, ఎయిర్‌బస్, సాఫ్రాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. 2047 నాటికి ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవడం లక్ష్యమని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ, 2023-25 మధ్య 117.9 శాతం వృద్ధి నమోదు కావడం గర్వకారణమని తెలిపారు. విమాన విడిభాగాలు, రక్షణ పరికరాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలని వివరించారు. యువతకు నైపుణ్య శిక్షణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్యు), అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఎటిసిఎస్), పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా పరిశ్రమలకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఈ సంస్థలను వైఐఎస్యు పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వెల్లడించారు. స్కైరూట్ సీఈఓ పవన్ కుమార్ చందన మాట్లాడుతూ, నైపుణ్య శిక్షణలో వైఐఎస్యుతో భాగస్వామ్యం చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తమ సంస్థకు అవసరమైన ప్రతిభను అభివృద్ధి చేయడంలో ఈ భాగస్వామ్యం కీలకమని అన్నారు. విక్రం-1 రాకెట్ తేలికగా, దృఢంగా ఉండటంతో పాటు బహుళ ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపగల సామర్థ్యం కలిగి ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మరియు స్కైరూట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ దాకా, గ్రీన్‌కో వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ చలమలశెట్టి తదితరులు పాల్గొన్నారు.

 

Vikram-1 orbital rocket launched from Hyderabad

More articles

Latest article