- నిలిస్తే గెలవలేమనే
- పదవులను కాపాడుకునేందుకే
- వారు రాకపోతే ఇక అంతే..
నిజామాబాద్, బతుకమ్మ: రెవిన్యూ విభాగంలో ఏకపక్షంగా ఉన్న ట్రెసా యూనియన్ లో ఎన్నికలకు అగాధం ఏర్పడుతోంది. ఏడేళ్ల కాలం దాటినందున నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని ఉద్యోగుల నుంచి క్రమేణ ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలిసింది. జిల్లాలో నుంచి వెళ్లిన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తిరిగి రాగానే ఎన్నికలు నిర్వహిద్దామని దాటవేత సమాధానాలు చెప్తున్నట్లు సమాచారం.
వారు వచ్చాకనే..
శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిబంధనలను అనుసరించి జిల్లా నుంచి తహసీల్దార్లను, డిప్యూటీ తహసీల్దార్లను కమీషన్ బదిలీ చేసింది. ఆ ఎన్నికలు పూర్తయి ఆరు నెలలు గడుస్తోంది. అయినా వారిని ప్రభుత్వం తిరిగి సొంత జిల్లాలకు పంపించలేదు. ఇలాంటి సున్నితమైన విషయాన్ని పట్టుకొని వారు వచ్చాకనే ఎన్నికలు అనడంపై కార్యవర్గంలో స్థానం కోసం చూస్తున్నవారు మండిపడుతున్నారు.
నిలిస్తే గెలవలేం…
సుధీర్ఘ కాలంగా యూనియన్ నాయకులుగా తిరుగుతున్న వారికి ఎన్నికలంటే భయం పట్టుకున్నట్లుంది. రెవిన్యూ విభాగంలో కొంతమందిని వదిలితే, మిగతా వారందరిలోనూ ప్రస్తుత యూనియన్ కార్యవర్గం పట్ల వ్యతిరేకత ఉందనే విషయాలు ఆరోపణల రూపంలో బయటకు వస్తున్నాయి. ట్రెసా యూనియన్ ను ఎన్నికల నిర్వహణను పక్కకు తప్పించేందుకు జిల్లాను విడిచినవారి గురించి వల్లె వేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఉద్యోగులు తెలుసుకున్నారు. పదవులు ఊడుతాయనే భయంతోనే డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారనే విషయాన్ని రెవిన్యూ విభాగం పసిగట్టింది. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఎన్నికలు పెట్టడం ఇష్టం లేకనే ఇతర జిల్లాలకు వెళ్లిన వారి రాక గురించి ప్రస్తావనను తీసుకువచ్చి కాలయాపన చేస్తున్నారనే ప్రచారం శాఖలో జరుగుతోంది.
చాపకింద నీరులా మరో సంఘం…
రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ శాఖలో ట్రెసా యూనియన్ ఒకటే ఉంది. దీనివల్ల మరో దారిలేక మింగలేక, కక్కలేక అదే యూనియన్ లో కొనసాగుతున్నారు. మరో సంఘం ఉన్నట్లయితే సమస్యలపై పోరాడేందుకు పోటాపోటి ఉండేది. ప్రత్యామ్నాయం యూనియన్ ను రాష్ట్ర కేంద్రంలో ముందుగా ఏర్పాటు చేసిన జిల్లాల వారీగా సంఘాన్ని బలోపేతం చేయడానికి చాపకింది నీరులా వ్యూహాలు పన్నుతున్నారు.
వారు రాకపోతే…
వేరే జిల్లాలకు వెళ్లినవారు సొంత జిల్లాలకు రాకపోతే ఎన్నికలు నిర్వహించరా అనే అనుమానాలు ఉద్యోగులలో పొడసూపుతున్నాయి. అక్కడి నుంచి వచ్చినవారిలో నూతన కార్యవర్గం ఏర్పాటు కోసం ఎంత మంది భాగస్వాములు అవుతారో తెలియని విషయం. అలాంటి వారిని చూపుతూ ఎన్నికలను వాయిదా వేయడం సరైంది కాదని ఉద్యోగులు భావిస్తున్నారు.
ట్రెసాపై సన్నగిల్లుతున్న ఆశలు
ఏళ్ల తరబడిగా ఒకే కార్యవర్గం ఉండడం, ఉద్యోగులపై ఆధిపత్యం చేలాయించడంతో పాటు వారి కార్యకలాపాలు అధికమయ్యాయి. సహనం నశించినవారు, యూనియన్ నుంచి సహాయానికి నోచుకోలేనివారు ట్రెసాపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల వల్ల చాలా మంది ఉద్యోగులు యూనియన్ కు దూరంగా ఉంటున్నారు.
