26.2 C
Hyderabad
Monday, August 3, 2026

జకోరా, చందూర్, చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తుదిదశకు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఖరీఫ్‌కు ముందే నీటి సరఫరా

 

. . . మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా రైతులకు భారీ ఊతమిచ్చే జకోరా, చందూర్, చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్ పథకం తుదిదశకు చేరుకుంది. ఈ పథకాన్ని త్వరలో ప్రారంభించి ఖరీఫ్ సీజన్‌కు ముందే సాగునీరు అందించనున్నట్లు మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రూ.106.04 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా వర్ని, చందూర్, మోస్రా మండలాల్లోని 7,975 ఎకరాలకు సాగునీరు అందనుంది. ముఖ్యంగా బాన్స్వాడ నియోజకవర్గ రైతులకు ఈ పథకం పెద్ద మేలు చేయనుంది. ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తి దశకు చేరుకున్నాయని, ఇప్పటికే లిఫ్ట్ వ్యవస్థపై ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించామని మంత్రి వెల్లడించారు. ఆధునిక పంప్ హౌస్‌లు, పైప్‌లైన్‌లు, కాలువల నెట్‌వర్క్‌తో నీటి పంపిణీ వ్యవస్థను సమర్థంగా రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్ట్ అమలుకు వేగం తీసుకొచ్చిందని, పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల పనులను పూర్తి చేసి రైతులకు ప్రత్యక్ష లాభాలు చేకూర్చడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కొత్త ఆయకట్టు సాగులోకి రానుండటంతో పాటు, ఉన్న సాగుభూములకు స్థిరమైన నీటి సరఫరా లభించనుంది. అదనంగా చెరువుల నింపుదల, భూగర్భ జలాల పెరుగుదలకు కూడా ఇది తోడ్పడనుంది. కొద్ది వారాల్లో ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రారంభించి, ప్రాంతీయ రైతులకు అంకితం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

More articles

Latest article