. . . ప్రేరణ – 2026 ఇంటర్ కాలేజియేట్ కామర్స్ ఫెస్ట్ సమన్వయకర్త జి.రాంబాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విద్యార్థులకు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రేరణ – 2026 ఇంటర్ కాలేజియేట్ కామర్స్ ఫెస్ట్ ఉత్తమ వేదికగా నిలుస్తుందని ప్రొఫెసర్ జి.రాంబాబు తెలిపారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్, తెలంగాణ యూనివర్సిటీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో “ప్రేరణ – 2026 ఇంటర్ కాలేజియేట్ కామర్స్ ఫెస్ట్” ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపి గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ ఫెస్ట్ లో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ స్థాయి పోటీలు నిర్వహించబడనున్నాయన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల బి.కాం విద్యార్థులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయ స్థాయి పోటీలు 2026 ఏప్రిల్ 2వ తేదీన నిజామాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించబడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ సమన్వయకర్త రాంబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన విద్యార్థుల నమోదు జాబితాను సంబంధిత కళాశాలలు 31 మార్చి 2026 లోపు ఇమెయిల్ ద్వారా tucomdept@gmail.com కి పంపవలసిందిగా కోరారు. ఈ ఫెస్ట్ లో భాగంగా వ్యాసరచన, బిజినెస్ క్విజ్, చైనీస్ విస్పర్, రీల్ టు రియల్, యాడ్-మ్యాడ్ షో, జస్ట్ ఎ మినిట్, జుగాడ్ జీనియస్ (బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్), గ్రూప్ సాంగ్, గ్రూప్ డాన్స్ వంటి వివిధ ఈవెంట్లు నిర్వహించబడనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయ స్థాయిలో ఎంపికైన టాప్ 2 జట్లు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించి, సికింద్రాబాద్‌లోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో నిర్వహించబడే పోటీలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతాయని వారు తెలిపారు.
