నిజామాబాద్, బతుకమ్మ: ఎస్సీ వర్గీకరణ అమలుకాకుండానే డీఎస్సీ ఫలితాలు ప్రకటించడంతో మాదిగ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం నల్లజెండాలో నిరసన తెలిపారు. అంతకు ముందు గౌతంనగర్ లోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కు తరలివచ్చారు. ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి మాదిగ మాట్లాడుతూ.. వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో మూడు దశాబ్ధాలుగా రాజీలేని పోరాటం చేస్తున్నామని, సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందన్నారు. ఈ తీర్పుతో ముప్ఫై ఏళ్ల పోరాటానికి న్యాయమైన పరిష్కారం లభించిందన్నారు. సుప్రీం తీర్పు వచ్చిన అర గంటలోనే అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. సుప్రీం తీర్పును స్వాగతిస్తూన్నామని, దేశంలో వర్గీకరణను అమలు చేసే తొలి రాష్ట్రం తెలంగాణనే అవుతుందని ప్రకటించారని గుర్తు చేశారు. రెండు నెలలు గడుస్తున్నా ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను మర్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ ద్వారా 11062 ఉద్యోగాలను భర్తీ చేస్తూ మాదిగలకు ఘోరమైన అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేంత వరకు ఉద్యోగ నియామకాలు పూర్తిగా నిలిపివేయాలని కోరారు. నిరసనలో జిల్లా నాయకులు మైలరాం బాలు, యమున, సత్తెక్క, సావిత్రి, పద్మ, భూమన్న, రాజేశ్, ప్రవీణ్, మారుతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

