. . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఉగాది ఉత్సవాల సందర్భంగా ఈ సంవత్సరాన్ని రైతు నామ సంవత్సరంగా, రైతుని రాజుగా చేయడమే తమ లక్ష్యమని ప్రకటించిన సీఎం రైతు నామ సంవత్సరానికి అర్దమేమిటో తెలపాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తగినన్ని నిధులు కేటాయించలేరని ఆయన మండిపడ్డారు. జిల్లాలో అధికార పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, పీసీసీ ప్రెసిడెంట్ జిల్లా వారే ఉన్నా గాని జిల్లాలో కనీసం ఎలాంటి ఆర్థిక కేటాయింపులు లేవని, జిల్లాలో రెండు చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించాలని రైతులు డిమాండ్ చేస్తే దీనిపై అసెంబ్లీలో వేసిన సబ్ కమిటీ తన రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించినా ఫ్యాక్టరీలను తెరవకపోవడం జిల్లా పట్ల నిర్లక్ష్య వైఖరి తెలియజేస్తుందని వాపోయారు. దీంతో పాటు ఆగి పోయిన మంచిప్ప 21 ప్యాకేజీ పునఃప్రారంభించి ఇస్తామని చెప్పిన సీఎం దీనికి ఒక రూపాయి కూడా కేటాయించకపోవడంలో ఔచిత్తం ఏమిటని రైతులు అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించాలని, 21 ప్యాకేజీ పనులు ప్రారంభానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
