29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బిల్లు కావాలంటే కమీషన్ ఇవ్వాల్సిందే..

Must read

📰 Generate e-Paper Clip

. ట్రాన్స్ పోర్ట్ బిల్లుల మంజురు కోసం అసోసియేషన్ వసూళ్లు

. ధాన్యం సేకరణకు ముందు మిల్లర్ల నుంచి డబ్బులు డిమాండ్

. సీఎంఆర్ కేటాయింపులపై ఆశలు వదులుకోని డిఫాల్టర్లు

నిజామాబాద్, బతుకమ్మ: ధాన్యం కేటాయించాలంటే అధికారులకు మామూళ్లు ఇవ్వాలని ప్రతి సీజన్ లో మిల్లర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తోంది రైస్ మిల్లర్ అసోసియేషన్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి సీజన్ లో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న తంతు ఇది. దాని కారణంగానే నిజామాబాద్ అసోసియేషన్ రెండు ముక్కలైంది. మామూళ్లు ఇచ్చి పనులు చక్కబెట్టుకునే ఒక అసోసియేషన్, ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పారదర్శకంగా మిల్లింగ్ చేసే మరోశాఖ గా అసోసియేషన్ విడిపోయింది. దాదాపు ఏడాది కాలంగా అసొసియేషన్ ముక్కలై కార్యకలపాలు సాగిస్తోంది. అయినప్పటికీ అందులోని ఒక అసోసియేషన్ తీరు మారలేదు. కొన్ని సీజన్ల కు సంబంధించిన బియ్యాన్ని ఎఫ్ సీఐ కి రవాణా చేసిన లారీల అద్దె చెల్లించాలంటే 7 శాతం ఇవ్వాల్సిందేనని పేచీ పెట్టింది. ఇటీవల ఈ విషయం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిదికి, కమిషనర్ కు కొందరు మిల్లర్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంలో ఈ విషయం వెలుగు చూసింది. ఓ అధికారి పేరు చెప్పి వసూళ్ల పర్వానికి తెరలేపారు.  గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన ట్రాన్స్ పోర్టు బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుండటంతో దానిని సొమ్ము చేసుకునే పనిలో పడింది రైస్ మిల్ అసోసియేషన్. 2016 నుంచి రైస్ మిల్లుల యాజమాన్యాలకు ట్రాన్స్ పోర్టు బిల్లులు రాలేదు. దాదాపు 300పైచిలుకు రైస్ మిల్లులకు దాదాపు రూ.30 కోట్ల వరకు రవాణా భత్యం రావాల్సి  ఉంది. ఈ విషయంలో ఓ అధికారి తన చేతికి మట్టి అంటకుండా వసూళ్ల పర్వానికి తెరతీశారు. తన శాఖలో పని చేసే రెగ్యులర్ ఉద్యోగులకు ఈ విషయం తెలిస్తే లీక్ అవుతుందని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ద్వారా అసోసియేషన్ నేతల ద్వారా వసూళ్లు చేపట్టారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మిల్లరు తనకు ట్రాన్స్ పోర్టు బిల్లు రూ.7లక్షల వరకు రావాల్సి ఉందని అసోసియేషన్ కు ఈ విషయాన్ని తెలిపి రూ.50వేలు కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని వాపోయారు. ఈ అంశాన్ని జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే చెంతకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండానే మిల్లర్లు బహిరంగ మార్కెట్ లో అమ్ముకున్న ఉదంతం బహిర్గతమైన విషయం తెలిసిందే. ఒక్క నిజామాబాద్ జిల్లాలో 200 కోట్లకు పైగా విలువైన ధాన్యం పక్కదారి పట్టడంతో ప్రభుత్వం  మిల్లర్లను డిఫాల్టర్లుగా ప్రకటించి, రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం ఆదేశాలు జారీ చేసింది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం కేటాయింపుల కోసం డిఫాల్టర్ ల లిస్టులో ఉన్న వారికి ధాన్యం కేటాయింపులు చేయాలా? వద్దా? అనే సంశయం కొనసాగుతుండగా.. ఇప్పుడు ట్రాన్స్ పోర్టు బిల్లుల చెల్లింపునకు 7శాతం డిమాండ్ చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ కేటాయింపు, బిల్లుల మంజూరు కావాలంటే సంబంధిత అధికారి మెప్పు పొందాలని, ఇందుకోసం అసోసియేషన్ అడిగినంత ఇచ్చేందుకు రైస్ మిల్లర్లు సిద్ధమవుతున్నారు. మరో అసోసియేషన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

More articles

Latest article