. . . వెలుగుమట్ల భూనిర్వాసితుల కోసం నిరసన
. . . కల్వకుంట్ల కవిత, విశారదన్ మహారాజ్ ల అరెస్టు
ఖమ్మం, బతుకమ్మ :
ఖమ్మం జిల్లా కేంద్రంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో బాధితుల పక్షాన చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు.

వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని, ప్రభుత్వానికి రాజకీయ నాయకులకు ఈ ఆడబిడ్డల ఉసురు తగులుతుందన్నారు. పరీక్షల సమయంలో పుస్తకాలతో సహా ఇళ్లను కూల్చేశారని, మీ ఆవేదన , బాధ కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ గా మారిందని అన్నారు. గతంలో మీ ఇళ్లు కూల్చే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తోందని, ముఖ్యమంత్రి, జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఈ సమస్యపై మాట్లాడాలని, బాధితుల ఇళ్లు కూల్చిన చోటే వారికి కొత్త ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ , ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ ప్రజా సంఘాలతో పాటు జాగృతి కూడా మీకు తోడుగా ఉంటుందని, ఒక పరిష్కారం వచ్చే వరకు కూడా మనం సమస్యను వదలకుండా పోరాటం చేద్దామన్నారు. మనల్ని ఓ కొట్టంలోకి తోలినట్లు ఇక్కడకు తీసుకొచ్చి పెట్టేశారని, కనీసం మహిళలకు ప్రత్యేక వసతి లేదన్నారు. రాష్ట్రం మొత్తం కూడా పేదల మీద జులుం నడుస్తోందని, పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లు పంపుతూ అన్యాయం గా వ్యవహరిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ పట్టుకునే రాజ్యాంగాన్ని కూనీ చేసేలా పేదల మీదకు బుల్జోజర్లు వస్తున్నాయని, దానిని ఎదిరించి మీ పక్షాన నిలిచేందుకే ఇక్కడకు వచ్చామన్నారు.మనందరం కలిసి ఓ కార్యాచరణ రూపొందించుకొని పరిష్కారం కోసం ప్రయత్నిద్దామన్నారు.

