. . . పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సుప్రియ
డిచ్ పల్లి, బతుకమ్మ :
మహిళల అభివృద్దే మన దేశాభివృద్ధి అని, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడాలని ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుప్రియ అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం డిచ్ పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని ఘనపూర్ గ్రామం లో మహిళల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతు శ్రామిక మహిళ ఉపాధి పై దాడికి వ్యతిరేకంగా పోరాడుదామన్నారు. మార్చి 8 అంతర్జాతీయ స్థానిక మహిళ పోరాట దినం వర్ధిల్లాలని, మహిళల దినోత్సవం అంటే మహిళలు తమ సమస్యలపై పోరాడాలని స్ఫూర్తి పొందిన రోజు అని, పోరాటాల ద్వారా హక్కులు దక్కుతాయని చాటిచెప్పిన రోజు అని తెలిపారు. మేము మనుషులమే మాకు మానవ హక్కుల వర్తిస్తాయంటూ మహిళలు ఓటు హక్కు కోసం, ఎనిమిది గంటల పని దినం కోసం, మెరుగైన పని పరిస్థితుల కోసం, అలుపెరుగని పోరాటాలు చేశారని పేర్కొన్నారు. ఎముకలు కొరికే చలిలో వాయునేట్లకు ఎదురుగా నిలబడి పోరాటాలు చేశారని, అసమానత్వానికి అణచివేతకు వ్యతిరేకంగాను హక్కుల కోసం మహిళలంతా ఒకటై గొంతు విప్పారని తెలిపారు. ప్రభుత్వాలు ఉద్యమాల్ని రక్తసిక్తం చేస్తూ ఎంతగా అణచాలని చూస్తే అంతగా ప్రాణ త్యాగాలతో కూడిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా అల్లుకుపోతుందని, మహిళలకు ముఖ్యంగా బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పి ఓ డబ్ల్యు జిల్లా నాయకురాలు బండమిది లత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని, 100 రోజుల పనిని 300 కు పెంచాలని అన్నారు. కార్పొరేట్ల అశ్వమేధ యాగాన్ని వ్యతిరేకించాలని ఆమె కోరారు. ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్లను వెనుకకు తీసుకోవాలని, సంఘటిత అసంఘటిత రంగంలో మహిళా ఉపాధి భద్రతను కల్పించాలని, జీవించే హక్కును హరిస్తు, మహిళ, పిల్లల అక్రమ రవాణాలను, మద్యం, మారకద్రవ్యాలను, నీలి చిత్రాలను అరికట్టాలని పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో సమాన అవకాశాల కోసం భూమిపై హక్కు స్వయం నిర్ణయం అధికార హక్కుకై పోరాడుదామని, మహిళలపై కొనసాగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడుదామని ఆమె అన్నారు. ఈ సమావేశంలో బొల్లారం రజిత, సృజన, లక్ష్మి, సుష్మ, రాజ్యలక్ష్మి, నీలిమ, కవిత, మమత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.


