26.6 C
Hyderabad
Monday, August 3, 2026

బాన్సువాడ సరస్వతి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ , బాన్సువాడ : విజయదశమి పండుగ పురస్కరించుకొని గ్రామం మొదలుకొని పట్టణాల వరకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారిని ప్రతిష్టాపన చేసి తొమ్మిది రోజులపాటు కుంకుమార్చనలు, యజ్ఞాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ పట్టణ కేంద్రంలో గల సరస్వతి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలో కుంకుమ అర్చన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, మధ్యాహ్నం యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సరస్వతి ఆలయం బాన్సువాడలో ఉండడంతో పరిసర ప్రాంతాలు నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ఓడి బియ్యం, గాజులు, నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సోమవారం సరస్వతి ఆలయంలో ఉదయం కుంకుమ అర్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రమైన బీర్కూర్ దుర్గా భవాని కమిటీ ఆధ్వర్యంలో కామప్ప చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన దుర్గాదేవి ఉత్సవాలు నిర్వహించడం ఇది 25వ సంవత్సరం కావడంతో దుర్గ భవాని కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దుర్గాదేవి వద్ద మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ ఆలయంలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపాలు కుంకుమార్చన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు, కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. దేవి నవరాత్రులు ఉత్సవల సందర్భంగా గ్రామాలలో, పట్టణాలలో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అమ్మవారి నామ స్మరణతో గ్రామాలు దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా ఈ పండుగలో ఎక్కువగా మహిళలు పాలుపంచుకుంటారు. వారికి కావలసిన ఏర్పాట్లను దుర్గ భవాని కమిటీలు ఏర్పాటు చేశాయి.

More articles

Latest article