. . . ఇంకా ఖరారు కానీ నిజామాబాద్ మేయర్ అభ్యర్థిత్వం
. . . సందిగ్ధంలోనే కామారెడ్డి చైర్ పర్సన్ ఎంపిక
. . . ఆరు మున్సిపాలిటీలలో పాలకుల ఎంపిక లాంచనమే
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ నెల 11న నిజామాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీంగల్, బిచ్కుంద మున్సిపాలిటీలలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎన్నుకునేందుకు ఓట్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 13న ఫలితాలు వెలువడగా నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి మున్సిపాలిటీల మినహా మిగిలిన ఆరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నిజామాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ లో కామారెడ్డి మున్సిపాలిటీలో ఏ పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. దాంతో కొత్త మేయర్ తో పాటు కామారెడ్డి మున్సిపాల్ చైర్ పర్సన్ వ్యవహరం క్యాంప్ రాజకీయాలకు తెర లేపింది. నిజామాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ లో 60 డివిజన్ లకు గాను 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ సంఖ్యా బలం కారణంగా ప్రతిపక్షానికే పరిమితమైంది. 17 స్థానాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు వచ్చిన మజ్లీస్ తో కలిసి మేయర్ స్థానాన్ని గెలుచుకునేందుకు భాగస్వామ్యంతో మేయర్ పీఠంను ఎగురేసుకపోయింది. డిప్యూటీ మేయర్ మజ్లీస్ పార్టీకి, మేయర్ స్థానం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని నిర్ణయించారు. డిప్యూటీ మేయర్ ఎంపిక ఆదివారం పూర్తి కాగా మేయర్ ఎంపికను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు పర్యవేక్షిస్తున్నారు. 17 కార్పొరేటర్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు మాత్రమే మహిళలు గెలిచారు. అందులో ఒకరినే మేయర్ పదవి దక్కనుండగా క్యాంప్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులు దక్కేది ఎవరికో తెలియాలంటే సోమవారం నాటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ సీల్డ్ కవర్ ద్వారా మేయర్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది.
కామారెడ్డి మున్సిపాలిటీలో 49 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, మిగిలిన స్వతంత్రులు గెలుచుకోవడంతో మ్యాజిక్ ఫీగర్ కోసం కాంగ్రెస్ పార్టీ తంటాలు పడుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ సమక్షంలో ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంత మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కు టచ్ లో వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఆ నలుగురు తాము బీఆర్ఎస్ అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటామని స్పష్టం చేస్తూ వీడియోను విడుదల చేశారు. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని స్వతంత్రులకు ఇస్తారని పుకార్లు షికార్లు చేశాయి. సోమవారం కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనే చైర్ పర్సన్ ఎంపిక వ్యవహరం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బోధన్, ఆర్మూర్, ఎల్లారెడ్డి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడల మున్సిపల్ చైర్మన్లు, చైర్ పర్సన్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలిసింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లోనే వారి పేర్లను వెల్లడించి ప్రమాణ్వీకారం చేయిస్తారని ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరేందుకు బల్ధియా అధికారులు ఏర్పాట్లు చేశారు. మేయర్ , చైర్మన్ ల ఎన్నికలు జరిగే ప్రాంతంలో పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది.
