29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలింగ్ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీ.ఓల శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్, అబ్జర్వర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల పరిశీలకులు సీహెచ్. సత్యనారాయణ రెడ్డి సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. ఆర్మూర్ లోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణ విధులపై మాస్టర్ ట్రైనర్ చే మంగళవారం  అవగాహన కల్పించారు. శిక్షణ తరగతులను సందర్శించిన సందర్భంగా అదనపు కలెక్టర్, అబ్జర్వర్లు పీ.ఓ, ఏ.పీ.ఓలకు కీలక సూచనలు చేశారు. హ్యాండ్ బుక్ లో పొందుపర్చిన అంశాలను క్షుణ్ణంగా చదివి పోలింగ్ విధులపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకళింపు చేసుకోవాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలని అన్నారు. పి.ఓలు చేపట్టాల్సిన చర్యలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి క్లుప్తంగా వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని, తప్పులు జరిగితే క్రమ శిక్షణ చర్యలకు గురి కావాల్సి ఉంటుందని అన్నారు. ఓటరు జాబితాలో పేరు ఉంటేనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించాలని సూచించారు. సమయ పాలన పక్కాగా పాటించాలని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ మెటీరియల్ తీసుకునే సమయంలో జాగ్రత్తగా పరిశీలించుకోవాలని అన్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద బి.ఎల్.ఓ సహాయక కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఓటరు స్లిప్ ఐడి కాదని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 18 రకాల ఐడి కార్డులలో ఏదైనా ఒక దానిని ఓటరు తీసుకురావచ్చని తెలిపారు. ఈ విషయమై విస్తృత స్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. రిపోలింగ్ కు ఆస్కారం లేకుండా, ప్రశాంత వాతావరణంలో సజావుగా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు పూర్తయ్యేలా జాగ్రత్తగా ఎన్నికలు జరపాలని సూచించారు. శిక్షణ తరగతులలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, పీ.ఓలు, ఏ.పీ.ఓలు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. అనంతరం పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ లను ఎన్నికల పరిశీలకులు సీహెచ్ సత్యనారాయణ రెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

 

Must have complete understanding of polling duties
Must have complete understanding of polling duties

More articles

Latest article