. . . మున్సిపల్ పోటీకి నో డ్యూస్ తప్పనిసరి
. . . ప్రపోజర్స్ కూడా క్లియర్ ఉండాల్సిందే
… సిడిఎంఏకు చేరిన కాంగ్రెస్ అభ్యర్థి నో డ్యూస్
నిజామాబాద్, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికలు బల్దియాకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈనెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 30 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉండడంతో ఆశావాహులు జోరుగా నామినేషన్ల దాఖలకు ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సవాడ, ఎల్లారెడ్డి, భీంగల్, బిచ్కుంద మున్సిపాలిటీలలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కచ్చితంగా ఇంటి పన్ను, కులాయి పన్ను, వాణిజ్య(ట్రేడ్ లైసెన్స్) పన్నులు చెల్లింపులు క్లియర్ ఉండాలని నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ లలో నో డ్యూస్ కోసం పోటీదారులు క్యూ కట్టారు. అయితే బుధవారం 12 నో డ్యూస్ ఇవ్వగా గురువారం ఒక్కరోజు 146 సర్టిఫికెట్లు అందజేశారు. నో డ్యూస్ సర్టిఫికెట్ ల వల్ల మున్సిపాలిటీ కి రూ. 3 కోట్ల వరకు ఆదాయం రానుంది. నిజామాబాద్ నగరంలో 50 కోట్ల ఆస్థి పన్ను బకాయిలు ఉన్నాయి. వీటిలో ఇద్దరు బడా వ్యాపారులే 20 కోట్ల వరకు బకాయి ఉన్నట్లు తెలిసింది. గత కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హయాంలో బకాయి చెల్లించని బడా వ్యాపారుల హోటళ్ళలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ కలెక్టర్ బదిలీ కావడంతో ఆ విషయం మరుగున పడింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు మిగిలిన 8 మున్సిపాలిటీలలో పన్నులు చెల్లించి నోటిఫికేషన్ పోటీదారులు వారిని బలపరిచే వారి చెల్లింపుల కోసం చాలామంది దరఖాస్తులకు ఎగబడ్డారు. నామినేషన్ల గడువు మరో 24 గంటల్లో ముగియ నుండడంతో చాలామంది పోటీదారులు పన్నుల చెల్లింపు చేపట్టి నోటిఫికేషన్ కార్యాలయాలకు పరుగులు తీశారు. బల్దియా కార్యాలయాలు గత రెండు రోజులుగా పన్నుల చెల్లింపు దారులతో కిటకిటలాడుతోంది. అదే సమయంలో సర్వర్లు బిజీ రావడంతో నో డ్యూస్ కోసం అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న అధికార పార్టీ అభ్యర్థికి సంబంధించిన నో డ్యూస్ సర్టిఫికెట్ వ్యవహారం సిడిఎంఏకు చేరింది.

వారికి సంబంధించిన వాణిజ్య సముదాయం బకాయిలు కోట్లలో ఉండడంతో వాటి క్లియరెన్స్ కు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మెలిక పెట్టారు. కచ్చితంగా బకాయిలు చెల్లిస్తేనే నో డ్యూస్ ఇస్తామని కరాకండిగా తేల్చి చెప్పారు. అసలే అధికార పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉండడంతో నో డ్యూస్ కోసం ఏకంగా నిజామాబాద్ బల్దియా అధికారులు సిడిఎంఏకు వివరించినట్టు తెలిసింది. ఇప్పటికే సంబంధిత అభ్యర్థికి చెందిన నక్షత్రాల హోటల్ కు సంబంధించి కోట్ల రూపాయల బిల్లుల వ్యవహారం కోర్టులో ఉందని తప్పించుకునే ప్రయత్నం చేయగా అధికారులు ఈ వ్యవహారాన్ని సిడిఎం ఏకు తెలిపినట్టు తెలిసింది. కచ్చితంగా బకాయిలు చెల్లిస్తేనే నో డ్యూస్ సర్టిఫికెట్ ను సీడీఎంఏని జారీ చేసే విధంగా చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో హాట్ టాపిక్ గా మారింది.

