. . . కార్పొరేషన్ ఎన్నికల్లో లౌకికవాదులకే ఆర్ ఎస్ పి మద్దతు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ స్పష్టమైన లౌకిక వైఖరితో ముందుకు సాగుతుందని రాష్ట్ర కమిటీ సభ్యులు బోడ అనిల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు, నాయకులు తమ పదవీకాలాన్ని ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ముగించారని, ఫలితంగా నిజామాబాద్ నగరం సమస్యల కుప్పగా మారిందని విమర్శించారు. నిజామాబాద్ నగరంలో మంచినీటి కొరత, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తత, రోడ్ల దుస్థితి, పారిశుధ్య లోపాలు వంటి అనేక మౌలిక సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ప్రజా అవసరాలను పట్టించుకోని పాలకుల వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని అన్నారు. భవిష్యత్తులో నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, ప్రజా సమస్యలపై నిజమైన చిత్తశుద్ధితో పనిచేసే లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు మాత్రమే మద్దతు ఉంటుందని బోడ అనిల్ స్పష్టం చేశారు. ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్న విషయాన్ని పార్టీ జిల్లా కమిటీ సమావేశం అనంతరం రెండు రోజుల్లో, కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించిన నిర్ణయాలతో సహా అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ పి నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు, జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, నాయకులు కృష్ణ తదితరులు పాల్గొని, లౌకికవాదం, ప్రజా హక్కులు, నగరాభివృద్ధి కోసం సమిష్టి పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
