27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజామాబాద్ లో సెక్యూరిటీ కౌన్సిల్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

. . . రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా పౌరుల భద్రతే లక్ష్యంగా, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల సమన్వయంతో రూపుదిద్దుకున్న ‘నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలోని జిల్లా మెడికల్ కళాశాల వేదికగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, కౌన్సిల్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం కౌన్సిల్ చైర్మన్‌గా సీపీసాయి చైతన్య, కన్వీనర్‌గా అదనపు డీసీపీ బస్వారెడ్డి, జనరల్ సెక్రటరీగా కవితా రెడ్డితో పాటు ఇతర సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధానంగా మహిళా, చిన్న పిల్లల రక్షణ, ట్రాఫిక్ భద్రత, మౌలిక సదుపాయాల రక్షణ, సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారిస్తుంది. కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు, గృహ సంఘాలు, వ్యాపార వర్గాలను భాగస్వాములను చేస్తూ నగరాన్ని సురక్షితమైన గమ్యస్థానంగా మార్చడమే దీని అంతిమ ఉద్దేశం. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ హైదరాబాద్, సైబరాబాద్ తరహాలో నిజామాబాద్‌లో కూడా ఇటువంటి కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం 8 ప్రధాన విభాగాలతో ఈ కౌన్సిల్ పని చేస్తుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో జుమ్మారాత్ బజార్‌లో దొంగలించిన సొత్తు అమ్మేవారని, ఇప్పుడు ‘డార్క్ వెబ్’ అటువంటి అడ్డాగా మారిందన్నారు. ఆధార్, క్రెడిట్ కార్డు వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఇటీవల ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో పోలీస్ డ్రెస్సుల్లో వచ్చి మోసగిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయని, ప్రజలు ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నుండి ప్రజలను రక్షించాలని ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రోడ్డు భద్రతపై డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏటా సగటున 800 హత్యలు జరుగుతుంటే,  రోడ్డు ప్రమాదాల్లో సుమారు 7,000 మంది మరణించడం విచారకరమన్నారు. అందుకే ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు కేవలం డ్రైవర్ మాత్రమే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలనన్నారు. కార్లలో ప్రయాణించే వారందరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, ఓవర్ టేకింగ్ ఎప్పుడూ కుడి వైపు నుంచే చేయాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు పరిసరాలపై దృష్టి సారించాలని కోరారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన నిజామాబాద్ గ్రామీణ (రూరల్) పోలీస్ స్టేషన్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో ఉన్న పోలీస్ స్టేషన్ నూతన భవనాలను పరిశీలించిన డీజీపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ ద్వారా నేర నియంత్రణలో మరింత వేగం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డీజీపీ, అతిథులు పాల్గొని వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని డీజీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హెల్మెట్లు ధరించి పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి , షబ్బీర్ అలీ , నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్. చంద్రశేఖర్ రెడ్డి,  ఐజిపి మల్టీజోన్ 1, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి , అదనపు డీసీపీ (ఏ.ఆర్) రామచంద్ర రావు, నిజామాబాద్ , ఆర్మూర్, బోధన్,  ట్రాఫిక్, సి టి సి ఎసిపిలు, సిఐలు , ఎస్సైలు  కౌన్సిల్ సభ్యులు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

 

 

Security Council launched in Nizamabad
Security Council launched in Nizamabad
Security Council launched in Nizamabad
Security Council launched in Nizamabad

More articles

Latest article