మాచారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఐదు గ్రామాల సర్పంచ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల పంచాయితీ ఎన్నికల సందర్భంగా గ్రామస్తులకు కోతుల బెడద, కుక్కల బెడద లేకుండా చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేసేందుకు వారు చట్టాన్ని చేతులోకి తీసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. మాచారెడ్డి మండలం భవానిపేట్, పాల్వాంచ, వాడి, ఫరీద్ పేట్, బండరామేశ్వర్ పల్లి గ్రామాల్లో గ్రామ సింహాలకు స్థానిక ప్రథమ పౌరుల ఆధ్వర్యంలో కుక్కలను హతమార్చినట్లు తెలిసింది. ప్రధానంగా ఇంజెక్షన్లు, విషగుళికలు కలిపిన ఆహారాన్ని పెట్టడంతో ఐదు గ్రామాల్లో దాదాపు 600 కుక్కలను హతమార్చినట్లు తెలిసింది. కరీంనగర్ జిల్లా మల్కాపూర్ కు చెందిన ఏదులపురం గౌతమ్ జంతు ప్రేమికుడికి కుక్కలను హతమార్చిన విషయం తెలియడంతో ఈ నెల 12న మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం పోలీసులు ఐదుగురు సర్పంచ్ లపై కేసు నమోదు చేసి జేసీబీల ద్వారా కుక్కలను సామూహికంగా పాతిపెట్టిన ప్రాంతంలో వాటి కళేబరాలను వెలికితీసి వెటర్నరి వైద్యుల ద్వారా పోస్టుమార్టం నిర్వహించారు. సంబంధిత పోస్టుమార్టం నివేదికల ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కుక్కల బెడదను తగ్గించేందుకు వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం లేదా వాటిని అటవీ ప్రాంతాల్లో వదిలిరావడమో చేయాల్సి ఉండగా వాటిని సామూహికంగా హతమార్చడంతో సర్పంచ్ లపై కేసులు నమోదు చేశారు. పోలీసులు కేసులు, పోస్టుమార్టం నివేదికల ఆధారంగా సర్పంచ్ లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
. . . గతేడాది బోధన్ మండలం 200 కుక్కల హతం
గ్రామంలో వీధికుక్కల దాడిలో గాయపడిన గ్రామస్తులు సామూహికంగా 200 వరకు కుక్కలను గతేడాది నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటఖుర్ధు గ్రామానికి చెందిన వారు హతమార్చారు. ఆనాడు బ్లూక్రాస్ నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు పంచాయితీ కార్యదర్శితో పాటు గ్రామ పారిశుధ్ద్య కార్మికులపై కేసులు నమోదు చేశారు. వీధి కుక్కలను నియంత్రించకుండా హతమార్చిన ఘటనపై బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల సూచన మేరకు కరీంనగర్ కు చెందిన గౌతమ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఆనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ కేసులో ఎవరిపైనా చర్యలు తీసుకున్నట్లు తెలిసిరాలేదు.



