నిజామాబాద్, బతుకమ్మ : ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈసందర్బంగా మోపాల్ మండల కేంద్రంలో ఈబిల్లుకు సంబంధించిన పత్రాలను, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఏఐకేఎంస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిందని, వ్యవసాయ కార్మికులకు, పేదలకు తీవ్రంగా నష్టం చేసే ఈబిల్లునుఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పనిదినాలను పెంచామనే పేరుతో కూలీల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నారన్నారు. ఇపుడున్న చట్టంలో 90శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా, దాన్ని 60శాతానికి కోత పెడుతూ 40శాతం నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని బిల్లులో పేర్కొన్నారన్నారు. దీంతో నిధుల కొరత వున్న రాష్ట్రప్రభుత్వాలు ఈ పథకాన్ని ఎత్తివేసే ప్రమాదం ఉందని ఆవేదనవ్యక్తంచేశారు. మహాత్మా గాంధీ పేరు తొలగించి చట్టం పేరుమార్చి వికసిత భారత్ ” గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ (విబి జి రాం జీ )పేరు పెట్టడం సమంజసంకాదన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న, న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి బండ మీది నర్సయ్య, అగ్గు చిన్నయ్య, డి గంగారం, తేరేంటి చిన్న మల్లయ్య, జి సాయిలు, గాదె రవి, జక్కు బుల్లెన్న, సుంకరి లచ్చన్న, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
