. వారి చుట్టే బదిలీల రా.. గం..
. ఏళ్లుగా జిల్లా కేంద్రాన్ని వీడని ఉద్యోగులు
. మరొకరికి దక్కని అవకాశం
. సర్వీస్ లో ఒకరికి ఒకేసారి అవకాశం ఇవ్వాలంటున్న ఉద్యోగులు
నిజామాబాద్, బతుకమ్మ : బదిలీల ప్రక్రియ మొదలైన నాటి నుంచి కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే ఉద్యోగులందరి నోళ్లలో నానుతున్నాయి. వివిధ మార్గాల్లో ‘ప్రొటెక్షన్’ తీసుకుంటున్న వారిద్దరూ జిల్లా కేంద్రాన్ని వీడడం లేదనేది సంస్థలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. పైగా ప్రతి ఉద్యోగికి వారిద్దరు సుపరిచితులు కావడం గమనార్హం. బదిలీల ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ ఇద్దరు ఉద్యోగులు జిల్లా కేంద్రాన్ని వీడుతారా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. బదిలీల రా.. గం.. వారి చుట్టే వినిపిస్తోంది.
ఏళ్ళ తరబడిగా..
పోస్టింగ్ తీసుకున్నప్పటినుంచి పవర్ హౌస్ లో ఉన్న ఒకరు స్పౌజ్, అసోసియేషన్, యూనియన్ లను బదిలీల సమయంలో వాడుకుంటూ ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు. మరొకరు యూనియన్, సంఘాన్ని వాడుకొని జిల్లా కేంద్రం నుంచి కదలకుండా ఉంటున్నారు. ‘చంటిగాడు లోకల్ అంటూ‘ కాలరెగిరేస్తూ పవర్ హౌస్ లో తిరుగుతున్నారు. వారిని చూస్తున్న ఉద్యోగులు లోలోన తిట్టుకుంటూనే మీరే మాకు దిక్కంటూ పైకి వారిని ఉబ్బిస్తున్నారు.
మరొకరికి అవకాశం లేకుండా
గత కొన్నేళ్లుగా ఏదో రకంగా తీసుకున్నవారే మళ్ళీ ప్రొటెక్షన్ తీసుకోవడంతో మరొకరికి అవకాశం లేకుండా పోతోందని, సర్కిల్ కు దూరంగా విధులు నిర్వహిస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘాల్లో, యూనియన్లలో పేరుకే సభ్యులుగా ఉన్నా అది జిల్లా కేంద్రంలో, డివిజన్లలో ఉన్న వారికి ఉపయోగపడుతుందనే విమర్శలు వినపడుతున్నాయి.
సర్వీస్ లో ఒకరికి ఒకసారే
విధుల్లో చేరిన నాటి నుంచి ప్రొటెక్షన్ అతి కొద్ది మందికి ఉపయోగపడుతోంది. కొందరు ఉద్యోగ విరమణ నాటికి సైతం యూనియన్, సంఘాన్ని వాడుకున్న సందర్భాలు లేవని చెబుతున్నారు. విద్యుత్ శాఖలో ఉన్న ఉద్యోగులందరికీ అవకాశం రావాలంటే తన సర్వీస్ లో ఏ ఒక్క దానిలో నుంచైనా ప్రొటెక్షన్ తీసుకుంటే వారికి పదవీ విరమణ వరకు అవకాశం ఇవ్వకూడదనే అభిప్రాయం ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. తీసుకున్న వారే పలుమార్లు జిల్లా కేంద్రం దాటకుండా ప్రొటెక్షన్ తీసుకుంటే మిగతా వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిబంధనలను కఠినతరం చేసిన కంపెనీ సీఎండీ దీనిపై లోతుగా ఆలోచిస్తే గత కొన్నేళ్లుగా పవర్ హౌస్ లో గబ్బిలాల్లా వేళాడుతున్నవారు డివిజన్లకువెళ్లే అవకాశాలు ఉంటాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
