. . . కేసీఆర్ దయతో వేల కోట్ల నిధులు తీసుకువచ్చా
. . . కాంగ్రెస్, బీజేపీలు ఆర్మూర్ కు పట్టిన అష్ట దరిద్రం
. . . రెండు పార్టీల అవినీతి, అక్రమాలకు తప్పుడు పనులకు జనతా గ్యారేజ్ లో రిపేర్ చేస్తా
. . . కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్మూర్ అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఆర్మూర్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది శ్వేతపత్రం విడుదల చేసి, జిల్లా అభివృద్ధి పై బహిరంగ చర్చకు రావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో స్వర్ణయుగంగా విరాజిల్లిన ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ సర్కార్ దిక్కుమాలిన పాలనలో పురోగతి కోల్పోయి అధోగతిపాలైందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్ళ బీ ఆర్ఎస్ పాలనలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జీవన్ రెడ్డి ఆదివారం తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ఏం చేశారో కాంగ్రెస్ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి లు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిర్వాకం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి, ప్రజాసంక్షేమం మాయం కాగా కాంగ్రెస్ అధికార దురహంకారం రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపులు, వేధింపులకు పాల్పడుతూ నియోజకవర్గాన్ని అవినీతి మయం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. రెండేళ్లలోనే ఆర్మూర్ అభివృద్ధి ఆమడ దూరం వెనక్కి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలు పట్టని బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్ కు శాపంగా మారిండు. అభివృద్ధి, సంక్షేమం గిట్టని అధికార కాంగ్రెస్ నేతలు భూతాలుగా మారారు. ఆర్మూర్ అభివృద్ధికి అణా పైసా తేలేని దద్దమ్మలు కాంగ్రెస్, బీజేపీల నాయకులు. బీజేపీకి వేసిన ఓటు ఆర్మూర్ ప్రగతికి చేటుగా పరిణమించిందని నియోజకవర్గం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు ఇచ్చిన అధికారం జనం కళ్ళలో కారం కొట్టింది’ అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన ఆర్మూర్ కు స్వర్ణయుగమన్నారు. కేసీఆర్ పదేళ్ళ పాలనలో దాదాపు రూ.3వేల కోట్ల నిధులు సాధించిన ఆర్మూర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన చరిత్ర తనదన్నారు.

ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చినవే. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పథకాలు తామే తెచ్చామని కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు.కాంగ్రెస్ ఇచ్చిన, బీజేపీ తెచ్చిన ఒక్క పథకం పేరు చెప్పగలరా?పదేళ్లలో నేను సాధించిన వంద పథకాల పేర్లు గుక్కతిప్పుకోకుండా చెప్పగలను. కాంగ్రెస్, బీజేపీలు ఆర్మూర్ కు పట్టిన అష్టదరిద్ర మని ఆ రెండు పార్టీల నాయకులు ఒప్పుకొని ప్రజల ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ రెండు పార్టీల అవినీతి, అక్రమాలకు, తప్పుడు పనులు తన నివాసంలో ఏర్పాటు చేసిన జనతా గ్యారేజ్ లో రిపేర్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేసేంతవరకు ప్రజల మధ్యే ఉంటానని జీవన్ రెడ్డి శపథం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్, రాజేశ్వర్ రెడ్డి,మీర శ్రావణ్, పృథ్వి,గణేష్,అజీమ్, అభిలాష్, లతీఫ్, రహమత్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
