- జైలు నుంచి విడుదలైన రౌడీ షీటర్ కోసం రెక్కీ
- కారులో, బైక్ లో భయబ్రాంతులకు గురి చేసిన గ్యాంగ్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పోలీసులు వెతుకుతున్న రౌడీషీటర్ సమద్ తన గ్యాంగ్ తో జిల్లా జైలు సమీపంలో హల్ చల్ చేశారు. మంగళవారం ఉదయం జైలు నుంచి విడుదలైన మరో రౌడీషీటర్ కోసం అతని ప్రత్యర్థి అయినా సమద్ తన గ్యాంగ్ తో ఇండికా కారులో, రెండు బైక్ లలో రెక్కీ నిర్వహించాడు. అక్కడ తన ప్రత్యర్థి అయినా రౌడీషీటర్ ఫీర్ధోస్ అలియాస్ పిద్ధూ జైలు నుంచి విడుదలవుతున్న విషయం తెలిసి అక్కడికి వెళ్లిన అతని సోదరులు ఉన్న కారును నిజాంసాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద కారు అడ్డుపెట్టి బెదిరించాడు. దానితో పిద్ధు సోదరులు డయల్ 100 కు ఫోన్ చేయడంతో అక్కడి నుంచి గ్యాంగ్ తో సహ జారుకున్నారు. పోలీసులు వచ్చిన అక్కడ ఎవ్వరు లేకపోవడంతో జైలు నుంచి విడుదలైన పిద్ధు సోదరుల సహాయంతో అక్కడి నుంచి కార్ లో వెళ్లిపోవడంతో గ్యాంగ్ వార్ తప్పింది…
నిజామాబాద్ పోలీసులు గత కొంత కాలంగా రౌడీషీటర్ సమద్ అలియాస్ చోర్ సమద్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఎందుకంటే అతని ప్రధాన అనుచరుడు రౌడీషీటర్ రియాజ్ అక్టోబర్ 17న నిజామాబాద్ నగరంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసాడు. ఆనాడు రౌడీషీటర్ రియాజ్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి పరారీ అయిన తరువాత తొలుత కలిసింది సమద్ నే. ఆనాటి నుంచి ఇద్దరి కోసం పోలీసులు గాలించారు. అనూహ్యంగా రియాజ్ నగర శివారులోని డైరీఫారం వద్ద 19న పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. పోలీసుల అరెస్టు సందర్భంగా గాయనడిన రియాజ్ జిజిహెచ్ లో 20 నాడు పోలీసుల తుపాకీ లాక్కుని వారిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించి పోలీస్ ఎన్ కౌంటర్ లో హతమైన విషయం తెలిసిందే. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య తరువాత జిల్లా పోలీస్ యంత్రాంగం రౌడీషీటర్ లపై ఉక్కుపాదం మోపింది. ఆనాటి నుంచి రౌడిషీటర్ సమద్ అడ్డాలు మారుస్తు తప్పించుకు తిరుగుతున్నాడు. కేవలం సోషల్ మీడియాలో తప్పితే ఇప్పటి వరకు పోలీసులు కనీసం అతని ఆనవాళ్ళు గుర్తించలేకపోయారు. సమద్ కు అతని గ్యాంగ్ కు కొందరు ఖాకీలు అండగా ఉండటంతోనే అతను తప్పించుకు తిరుగుతున్నాడని నిజామాబాద్ నగరంలో బైక్ లపై మాస్కులపై తిరుగుతున్న పట్టుకోలేక పోతున్నారనే విమర్శలు ఉన్నాయి.
రౌడీషీటర్ ల మధ్య విభేదాలు ఇప్పుడు, ఎప్పుడు గ్యాంగ్ వార్ లకు దారి తీస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. రౌడీషీటర్ సమద్, రౌడీషీటర్ పిద్ధులు ఒకనాడు సహచరులే. 2023 జూన్ 1 తమ సహచరుడు ఆరీఫ్ డాన్ హత్య కేసులో ప్రధాన నిందితులు. అరీఫ్ ను హత్య చేసిన తరువాత సమద్ పై నమోదైన కేసుల వెనుక పిద్ధు ఉన్నాడని కక్ష్య పెంచుకున్న సమద్ అతనిపై దాడి కోసం కాచుకుకూర్చున్నాడు. సమద్ ఈ విషయంలో రెండు, మూడు సార్లు అటాక్ చేసేందుకు యత్నించాడు కూడా. కానీ మధ్యలో తన సహచరుడు రియాజ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేయడంతో అజ్ణాతంలోకి వెళ్లిపోయాడు. ఇటీవల రౌడీషీటర్ పిద్ధును ఐదవ టౌన్ పోలీసులు అర్మ్స్ యాక్ట్ లో అరెస్టు చేసి జైలుకు పంపారు. మంగళవారం జైలునుంచి పిద్ధు విడుదల విషయం తెలిసిన సమద్ తన గ్యాంగ్ తో జైలు వద్ద అటాక్ కోసం రెక్కి నిర్వహించి పరిస్థితులు అనుకూలించక వెనుకడుగు వేయడం గమనార్హం. సమద్ ఒక కారు, రెండు కార్లలో తన అనుచరులతో అక్కడ ఉన్న విషయం స్థానికంగా సీసీటీవీ పుటేజీలో రికార్డు అయినట్లు తెలిసింది. సమద్ పరారీలో ఉన్నప్పటికీ సోషల్ మీడియా అకౌంట్ లతో, వాట్సప్ కాల్స్ తో ప్రత్యర్థులకు డైరెక్టుగా చంపుతానని తరువాతనే లొంగిపోతానని సవాల్ విసరుతుండడంతో మళ్ళీ గ్యాంగ్ వార్ తప్పదా అనే చర్చ జరుగుతుంది.