నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ నగర 23వ మహాసభను నగర కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలోని జేసిఎస్ ప్రసాద్ భవన్ లో నిర్వహించారు. పీడీఎస్యూ బిగిపిడికిలి జెండాను నగర అధ్యక్షులు ఎస్కే.అషూర్ ఆవిష్కరించారు. ఈ మహాసభకు ముఖ్యవక్తగా హాజరైన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. దేశంలో కుల, మతోన్మాదాలు పెచ్చరిల్లుతున్నాయన్నారు. పాలకవర్గాలే ప్రజల్ని విభజించి పాలిస్తున్నాయన్నారు. కులమత విద్వేషాలు లేని నూతన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రగతిశీల విద్యార్థులపైనే ఉందన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ మాట్లాడుతూ దోపిడీ పీడనలు లేని సమ సమాజం కోసం విద్యార్థి లోకం ఉద్యమించాలన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. మూఢనమ్మకాలకు, అశాస్త్రీయ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలన్నారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్, పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.సంధ్యారాణి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.గణేష్ లు మాట్లాడారు. ఈ మహాసభలో వివిధ ప్రజాసంఘాల నాయకులు వనమాల కృష్ణ, కే.గంగాధర్, లింగం, భాస్కరస్వామి, ప్రేమ్ సింగ్, విఠల్, కిరణ్, సాయిబాబా, చరణ్, రాజన్న, తారాచంద్ తదితరులు పాల్గొన్నారు.
- నూతన కార్యవర్గం ఎన్నిక..
ఈ సందర్భంగా పీడీఎస్యూ నగర నూతన కమిటీని ఎన్నుకున్నారు. నగర అధ్యక్షులుగా నసీర్, ప్రధాన కార్యదర్శిగా వినోద్, ఉపాధ్యక్షుడిగా నాగేష్, సహాయ కార్యదర్శిగా సృజన్, కోశాధికారిగా మణితేజ సభ్యులుగా మహేందర్, వికాస్, బన్నీ, అభిలాష్, 5గురిని కోఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
