25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అడ్డా మాదే.. లైసెన్స్ మాకే అమ్మాలి

Must read

📰 Generate e-Paper Clip

  • లైసెన్స్ ఉంటే సరిపోదు.. అడ్డా కావాలి
  • మద్యం దుకాణాలను దక్కించుకున్న వారికి బెదిరింపులు
  • లైసెన్స్ లు దక్కించుకునేందుకు సిండికేట్ బేరసారాలు
  • నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జోరుగా లైసెన్స్ ల కొనుగోళ్లు

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 152 మద్యం దుకాణాల లైసెన్స్ ల కేటాయింపుల ప్రక్రియ గత నెల 27తో ముగిసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్  దక్కించుకున్న వారు మద్యం దుకాణాలను తెరిచి లిక్కర్ అమ్మకాలు జరుపాలి. మూడు స్లాబ్ లలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు 2023-25లో ఒక్కో షాప్ లో నెలకు 3 నుంచి 6 లక్షల బిజినెస్ ను రోజువారిగా నిర్వహించారు. అందులో అత్యధికంగా సిండికేట్ వారికే దక్కడం విశేషం. ఈసారి మద్యం సిండికేట్ వ్యాపారులు వంద దరఖాస్తులు చేసినా వారికి లక్కీ డ్రాలో ఒకటి రెండు మించి దక్కలేదు. దానితో వారు మద్యం లైసెన్స్ లు కొనేందుకు ఎగబడ్డారు. డిసెంబర్ 1 వరకు మద్యం విక్రయాల కోసం కొత్తగా లైసెన్స్ లు దక్కించుకున్న వారు అడ్డాల కోసం ప్రయత్నిస్తుండడం సిండికేట్ వ్యాపారులకు వరంగా మారింది.

మందుబాబులకు మద్యం లైసెన్స్ దారు ఎవరు అనేది అక్కర్లేదు. వారికి రోజు మద్యం ఎక్కడ దొరుకుతుంది, అక్కడికి వెళ్లడమనేది రివాజు. ఇప్పుడు ఆయా అడ్డాలు పాత మద్యం వ్యాపారుల చెంతనే ఉండడంతో అక్కడా లైసెన్స్ లు దక్కని వారు అడ్డాను అడ్డుగా పెట్టుకుని బేరసారాలకు దిగారు. మద్యం అమ్మకాలు ఆశించినంత జరుగాలంటే పాత అడ్డాలే ఉంటేనే మద్యం ప్రియులు వస్తారని అప్పుడు సేల్ పెరుగుతుందని రివాజు. దానితో కొత్తగా మద్యం దుకాణాలు దక్కించుకున్నవారి నుంచి కొనుగోళ్ళకు ఒక్కొక్క లైసెన్స్ కు రూ.80 లక్షలు మొదలుకుని కోటి 20 లక్షలు చెల్లించేందుకు సిద్దమయ్యారు. ఉమ్మడి జిల్లాలో మద్యం వ్యాపారంలో నష్టపోయిన వారేవ్వరు లేరు. దాదాపు ఒక్కొక్క మద్యం దుకాణం  నిర్వాహకులు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల మిగులును సాధించినట్లు లెక్కలున్నాయి. అవి కేవలం అడ్డాల కారణంగానే అయ్యాయని నిరూపితమైంది. దానితో సిండికేట్ వ్యాపారులు లైసెన్స్ లు దక్కించుకున్న వారిని నయానో భయానో బెదిరించి వారు అడిగిన సొమ్మును ఇస్తామని అడ్డాలను సాకుగా చూపి కొనుగోళ్ళకు తెరలేపారు.

మద్యం లైసెన్స్ లు దక్కించుకున్న వారే  క్రయవిక్రయాలు చేయాలని నిబంధనలున్నాయి. ఇటీవల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మద్యం దుకాణాలు దక్కించుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన ఉద్యోగాన్ని ఫణంగా పెట్టాల్సి వచ్చిన విషయం తెల్సిందే. వాటిని కూడా పరిగణలోకి తీసుకుని ఉద్యోగులు సిండికేట్ లో ఉండరాదని వారి కుటుంబ సభ్యులు ఉంటే వారిపై కేసులు నమోదవుతాయని, ఉద్యోగాలు పోతాయని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాలో మద్యం దుకాణాలు ఒకటి కంటే ఎక్కువగా దక్కించుకున్న వారిని సిండికేట్ లో కలుపుకునేందుకు వ్యాపారులు వారి ఇళ్ళకు కార్లలో సంచుల మూటలతో వెళ్లడం విశేషం. మద్యం లైసెన్స్ లు అమ్ముకోవడం చట్టవిరుద్దం. దానితో వారినే ముందుపెట్టి అన్నీ అగ్రిమెంట్లు తమపై చేసుకుని విక్రయాలకు తెరలేపారు. మద్యం లైసెన్స్ దక్కిన వారే అమ్మకాలు చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ జారీ చేసే నౌకరి నామా ఇచ్చే సమయంలో అందినకాడికి దండుకునేందుకు ఆబ్కారి శాఖాధికారులు కూడా సిద్దమయ్యారు. ఈ నెల చివరి వరకు మద్యం దుకాణాల లైసెన్స్ ల అమ్మకాల ప్రక్రియ జోరుగా సాగనుంది. సిండికేట్ తమ పరిధిని పెంచుకునేందుకు కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైంది.

More articles

Latest article