- టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఒకే షిఫ్ట్ లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికులను గతవారం వరకు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఒకే షిఫ్ట్ లో పనిచేయించేవారన్నారు. కానీ ఇటీవల ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్ట్ లలో పని చేయించాలని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. వివిధ సర్కిలల్ల ల్లో పనిచేసే కార్మికులు తమ ఇంటి నుండి రెండుసార్లు రావడం రెండుసార్లు ఇంటికెళ్లడంతో ప్రయాణ చార్జీలు రెట్టింపు అవుతాయన్నారు. అదేవిధంగా సమయం వృధా అవుతుందన్నారు. రెండు షిఫ్టుల పద్ధతి వల్ల కార్మికులకు విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండదన్నారు. అదే సమయంలో అదనపు ప్రయోజనాలు కూడా లేవన్నారు. కావున గతంలో లాగే ఒకే షిఫ్ట్ లో పనిచేయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్న యూనిఫారం, సబ్బు, నూనెలు ఇతర పనిముట్లు ఔట్సోర్సింగ్ కార్మికులకు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంలో ఇప్పటికే అనేకసార్లు కమిషనర్ గారికి విన్నవించామన్నారు. ఇప్పటికైనా వెంటనే కార్మికులందరికీ సబ్బులు, నూనెలు, యూనిఫారం ఇతర పనిముట్లు అందజేయాలన్నారు. స్పందించిన మున్సిపల్ అడిషనల్ కమిషనర్ గారు వీలైనంత త్వరగా పై డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కే.రాజేశ్వర్, డి.రవికిరణ్, కే.రాము, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
