బాన్సువాడ, బతుకమ్మ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని బాన్సువాడ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ఆర్.అండ్.బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని డీఎస్పీ బి.విట్టల్ రెడ్డి ప్రారంభించారు.శిబిరంలో పోలీస్ సిబ్బంది, అధికారులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. డీఎస్పీ విట్టల్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి పోలీస్ సిబ్బందిని ప్రోత్సహించారు.ఈ సందర్బంగా డీఎస్పీ విట్టల్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు కేవలం చట్టవ్యవస్థ పరిరక్షకులే కాక, సమాజ సేవలోనూ ముందుండాలి. రక్తదానం అనేది మానవతా విలువలను ప్రతిబింబించే పవిత్రమైన కార్యం. ఒక బాటిల్ రక్తం ప్రాణాలను రక్షించగలదు అని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ,వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. పోలీసు సేవ అనేది ప్రజా రక్షణకు అంకితం చేయబడినది. ఈ వారోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది సమాజానికి మరింత సేవ చేయాలనే సంకల్పం తీసుకోవాలి అని తెలిపారు. రక్తదాన శిబిరం అనంతరం డీఎస్పీ మరియు అధికారులు రక్తదాతలను సత్కరించి, వారికి అభినందనలు తెలియజేశారు. శిబిరం విజయవంతంగా సాగడంతో పోలీస్ అధికారులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.ఈ రక్తదాన కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్, రూరల్ సీఐ తిరుపయ్య, ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

