25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కబ్జాదారులతో రిజస్ట్రార్ కుమ్మక్కు

Must read

📰 Generate e-Paper Clip

. తెలంగాణ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలి

. లేనిపక్షంలో ఉద్యమాలు తప్పవు

. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నాయకుడు సుధాకర్

 

డిచ్ పల్లి, బతుకమ్మ: తెలంగాణ యూనివర్సిటీ భూముల కబ్జాకు పాల్పడుతున్న వారితో రిజిస్ర్టార్ కుమ్మక్కయ్యారని, వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. నగరంలోని ఎన్ ఆర్ భవన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  విద్యార్థులతోపాటు విద్యార్థి, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు 2006లో ఐక్యంగా పోరాడితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిచ్ పల్లిలో  తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ 574 ఎకరాల భూములను కేటాయించిందన్నారు. ఆ భూముల్లో 54 ఎకరాలు తమ సొంత భూములని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు రికార్డులు రూపొందించగా, అప్పటి మంత్రి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వరప్రసాద్  సీరియస్ గా స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలికిన తహసీల్దార్ రవికుమార్ ను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రియల్ వ్యాపారులు కోర్టుకు వెళితే కోర్టు సైతం తెయూ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఆ తరువాత వారు హైకోర్టుకు వెళ్లారని, కోర్టులో యూనివర్సిటీకి అనుకూలంగా అన్ని రికార్డులను అందించి, అందుకు తగిన విధంగా కృషి చేయాల్సిన ప్రస్తుత రిజిస్ట్రార్ యాదగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాశారని ఆరోపించారు. 54 ఎకరాల యూనివర్సిటీ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని  యూనివర్సిటీ భూమిని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.  యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయాలని కుట్రలు చేస్తే విద్యార్థులు ప్రజలు ప్రజాసంఘాలు ఊరుకోబోవని, పెద్దఎత్తున ఉద్యమిస్తాయని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నాయకులు మురళి, సంధ్యారాణి, విటల్, గంగాధర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article