27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు రావాలంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంపీ అరవింద్ పదవికి రాజీనామా చేస్తే బీసీలలో గొప్పవారిగా మిగులుతారు
  • దేశంలో మోడీ ప్రభుత్వం మైనార్టీలో నడుస్తోంది
  • ఆర్వోబీల కోసం ఎంపీ అరవింద్ మోడీ, సీఎం ఇళ్ల వద్ద ధర్నా చేయాలి
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

నిజామాబాద్, బతుకమ్మ : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు రావాలంటే తెలంగాణకు చెందిన 8మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని, అప్పుడు బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో మోడీ ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం అని చంద్రబాబు, నితీష్ కుమార్ దయా దాక్షిణ్యాలతో నడుస్తుందని అన్నారు. బీసీలపై ఎంపీ అరవింద్ కు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని అప్పుడు బీసీలకు ఆరాధ్య దైవంగా మిగిలిపోతారని అన్నారు. ఇక్కడున్న నిజామాబాద్ ఎంపీ ఉన్నా లేనట్టేనని గతంలో మాధవనగర్ బ్రిడ్జీ గురించి చాలా మాట్లాడారని గుర్తు చేశారు. రెండేళ్లయిన కూడా బ్రిడ్జీ పనుల్లో పురోగతి లేదని అన్నారు. ఎంపీకి చిత్త శుద్ధి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి, పీఎం మోడీ లతో మాట్లాడి బ్రిడ్జీ పనులు పూర్తి చేయించాలని కోరారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు కే టాక్స్ నడుస్తుందని ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీ టాక్స్ నడుస్తుందా అని ఎంపీ అరవింద్ ను ప్రశ్నించారు. ఇటీవల జనం బాటకు వస్తున్నానని తెలిసి  మరో బీజేపీ ఎంపీ నా గురించి ఇష్టానుసారంగా మాట్లాడాడని ఆయన అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలను బట్టబయలు చేస్తానన్నారు.

  • అవకాశం, అధికారం, ఆత్మగౌరవం నినాదంతోనే జనంబాట..

రాష్ట్రంలో అందరికి సమాన అవకాశాలు లేకుండా ప్రభుత్వమే అణచివేస్తుందని, అధికారంలో వాటా విషయంలో కొన్ని వర్గాలే అనుభవిస్తుండగా ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుందని అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే నినాదంతో జనంబాట పట్టినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అధికారంలో మహిళల వాటా 5శాతం లేదని, కీలక నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఎస్సీ, ఎస్టీలకు భాగస్వామ్యం లేదన్నారు. ఆత్మగౌరవంతో కూడిన అభివ్రుద్ధి తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి పెట్టింది పేరని అవకాశం, అధికారం ఉన్నప్పుడే ఆత్మగౌరవం వస్తుందన్నారు.

BJP MPs should resign to get 42% reservation for BCs

  • గ్రూప్ – 1 ఉద్యోగాలు నాన్ లోకల్స్ కు కేటాయింపుపై పోరాటం చేస్తాం..

గ్రూప్ – 1 విషయంలో తెలంగాణ యువతకు అన్యాయం చేసి 8మంది నాన్ లోకల్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. దానిపై సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కు లేఖ రాసానని, వారు సుమోటాగా కేసు విచారణ చేపట్టక పోతే రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం అన్నారు. 8మంది గ్రూప 1 స్థాయిలో ఉండి ముప్పై ఏళ్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారని దానితో తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. 8మందికి ఉద్యోగాల నియామకాలు ఆపే వరకు పోరాటం చేస్తామని యువతకు జరిగిన నష్టంపై ప్రజలను జాగ్రుతం చేస్తాం అన్నారు.

  • ఐదేళ్ల క్రితమే ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకుని ఉంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయేది కాదు..
  • నిజామాబాద్ జిల్లాలో ఎంపీగా నా ఓటమికి ఎమ్మెల్యేలే కారణం
  • ఒక పార్టీలో ఇలాంటి సంఘటన జరగినప్పుడు ఆత్మ పరిశీలన సమీక్ష అవసరం

ఐదేళ్ల క్రితమే ఎమ్మెల్యేల పనితీరు ఏంటని తెలుసుకుని ఉంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయేది కాదన్నారు. బీఆర్ఎస్ లో తాను తిరుగుబాటు చేయలేదని, అంత అవకాశం ఇవ్వకుండానే నన్ను బయటకు పంపారన్నారు. కేసీఆర్ ఖచ్చితంగా మంచి సీఎం, మంచి నాయకుడని నాతో పార్టీ పెట్టించాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. కేసీఆర్ నిర్ణయంతోనే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను గాని, కేసీఆర్ ను గాని ఇష్యూ బేస్డ్ గానే విమర్శిస్తానన్నారు. పార్టీ పెట్టడం పెద్దపని కాదని పార్టీ కన్నా ప్రజల సమస్యలు తీరడమే ముఖ్యం అన్నారు. బీఆర్ఎస్ లో బాధ్యతను మరచిన మోసపూరిత వ్యక్తులదే పై చేయి అయిందని వారి కారణంగానే బీఆర్ఎస్, కేసీఆర్ కు నష్టం జరుగనుందని అన్నారు. ఇప్పుడు నాదారి నేను వెతుక్కుంటున్నాను. నాకు తెలియని తెలంగాణ కాదు. నా బాధ ప్రజలకు చెబుతూ, వాళ్ల బాధలు వింటూ సమస్యల పరిష్కారినికి జనం బాట ద్వారా పరిష్కరిస్తానని అన్నారు.

  • జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ జాగ్రుతి ఎలాంటి స్టాండ్ తీసుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లో జాగృతికి బలమైన క్యాడర్ ఉందని తెలిపారు. స్థానికి జాగృతి కార్యకర్తలు ఏపార్టీకి ఓటు వేయాలని వారే నిర్ణయం తీసుకుంటారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు సాధారణంగా రాలేదని ఎమ్మెల్యే మరణంతో వచ్చిన ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యత అక్కరలేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయాలంటే ముందు ఎన్నికలు జరుగాలి కదా అని అన్నారు.

More articles

Latest article