కోటగిరి, బతుకమ్మ : యాసంగి బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. క్వింటాల్ కు రూ. 500 బోనస్ వస్తుందన్న ఆశతో గత యాసంగి సీజలో పండించిన సన్నాలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ వేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోటగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన బోనస్ డబ్బులు ఇవ్వకుండా ఖరీఫ్ సీజన్ కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం పై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే యాసంగి పంట బోనస్ ఇచ్చి ఖరీఫ్ సీజన్ బోనస్ పై క్లారిటీ ఇచ్చేంతవరకు కదిలేది లేదంటూ భీష్మించారు. రైతుల ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న తహసీల్దార్ గంగాధర్, రుద్రూర్ ఎస్సై సాయన్న ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలలో క్వింటాల్ కు మూడు కిలోల చొప్పున తరుగు రూపంలో దోపిడీ చేస్తున్నారని రైతులు తహసీల్దార్ గంగాధర్ కు చెప్పగా ఈ విషయం తన దృష్టికి రాలేదని వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం తహసీల్దార్ గంగాధర్ కు వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో వల్లేపల్లి శ్రీనివాస్, తేళ్ల రవికుమార్, ఎముల నవీన్, మొరే కిషన్,మామిడి శ్రీనివాస్, గౌతమ్,కాపు గాండ్ల శ్రీను, పత్తి సాయిలు,పి, సతీష్,గాండ్ల వీరేషం,మామిడి సాయిలు, గంగప్రసాద్ గౌడ్, రాజు, మామిడి నవీన్,సుద్దులం విజయ్,సుదం నవీన్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
