29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సిక్సరా లేక “అష్ట”దిగ్బంధనమేనా..?

Must read

📰 Generate e-Paper Clip

  • బీసీ రిజర్వేషన్లపై అటు సుప్రీంకోర్టు.. ఇటు హైకోర్టులో కేసులు..
  • 6న సుప్రీమ్ కోర్టులో, 8న హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ
  • కోర్టు తీర్పులపై సర్వత్ర ఉత్కంఠ
  • అనుకూల రిజర్వేషన్ల గ్రామాల్లో ఆందోళన
  • కలిసి రానిచోట ఆశావాహ దృక్పథం
  • పల్లెల్లో ఎటు చూసినా ఇదే చర్చ

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లపై సర్వత్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజ్యాంగం ప్రకారం 50% దాటి రిజర్వేషన్లు ఉండరాదు అన్న నిబంధన మేరకు రెడ్ది జాగృతి అధ్యక్షుడు మాధవ్ రెడ్డి హైకోర్టులో కేసు వేయగా దీనిపై ఈనెల 8వ తేదీన తదుపరి విచారణ జరగనుంది. మరోపక్క తాజాగా సుప్రీంకోర్టులో సైతం ఈ అంశంపై కేసు నమోదు అయ్యింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరులో తీసుకువచ్చిన జీవో 9ని సవాలు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. “బీసీలకు రిజర్వేషన్ ను 25శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో తెచ్చింది. అప్పుడు ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10 శాతంతో కలిపి రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతాయి. ఇది పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏకు విరుద్ధం. వర్టికల్ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు. దీనిపై హైకోర్టు విచారణకు 2 రోజుల ముందే 6వ తేదీన విచారణకు హాజరుకావాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. మరోపక్క 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో ఈ అంశంపై తదుపరి విచారణ జరగనుంది. అసెంబ్లీలో బిల్లు ఆమోదించినప్పటికీ గవర్నర్ ఆమోదం లేకుండానే జీవో ఎలా జారీ చేస్తారని హైకోర్టు ఇదివరకే ప్రశ్నించింది. అయితే గవర్నర్ 90 రోజులలోపు తన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంటుంది అందుకు ఇంకో 20 రోజుల సమయం ఉంది. అంతవరకు ఆగకుండా ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా గతంలో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా జీవో జారీ చేసి ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసింది.

  • 42శాతం రిజర్వేషన్ చెల్లుబాటు అయ్యేనా..?

బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో రాజ్యాంగంలోని 50శాతం రిజర్వేషన్ మించకూడదు అన్న నిబంధనకు వ్యతిరేకంగా ఉన్నందున ఇది చెల్లుబాటు అయ్యే అవకాశం లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. అన్నీ తెలిసి రాష్ట్ర ప్రభుత్వం బీసీలలో మెప్పు పొందేందుకు ఈ ఎత్తుగడకు తెరలేపిందనే  వాదనలు ఉన్నాయి. హైకోర్టులో సరైన ప్రతివాదులు సరైన వాదనలు విడిపించకుండా కేసు వీగిపోతే ఇదే షెడ్యూల్ ప్రకారం ఎన్నికల కొనసాగించవచ్చని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు సర్ది చెబుతున్నారు.

  • షెడ్యూల్ 9 కింద ప్రతిపాదిస్తేనే సాధ్యమయ్యేది..

తమిళనాడు తరహాలో 50శాతం దాటి రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగంలోని షెడ్యూల్ 9 క్రింద అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు ఆమోదానికి ప్రతిపాదించాలని ఆ ప్రకారం చేసి తమిళనాడు ప్రస్తుతం 60 శాతానికి పైన రిజర్వేషన్లను అమలు చేస్తోందని మేధావులు పేర్కొంటున్నారు. అయితే  దీని అమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత అవసరం ఉంటుంది. కాంగ్రెస్, బిజెపిల మధ్య ఆ సఖ్యత ఆశించడం అత్యాశే అవుతుంది. ఇదే 42శాతం రిజర్వేషన్లతో ఎన్నికల జరిగే అంశంపై ప్రస్తుతం అనుమానాలకు తావిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం కోర్టుల పరిధిలో ఉండడంతో రిజర్వేషన్లు అనుకూలంగా రానివారు కోర్టు తీర్పుతో ఎన్నికలు రద్దు అయితే బాగుండని చర్చించుకోవడం కనిపిస్తుంది. మరోపక్క తమకు అనుకూలమైన రిజర్వేషన్లు వచ్చిన వారు మాత్రం కోర్టులో కేసు ప్రభుత్వానికి అనుకూలంగా రావాలని కోరుకుంటున్నారు. విద్యావంతులు, విద్యార్థులు ఇదంతా ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం అని బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సైతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదని అలా ఉంటే రాజకీయాలకతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుకూలమైన నిర్ణయం తీసుకునేవనే ఆరోపణలు వస్తున్నాయి. 42శాతం బిసి రిజర్వేషన్లపై ఎవరికివారు మైలేజ్ పొందేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారే తప్ప 42శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏ ఒక్కరు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని బీసీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఏది ఏమైనా ఆరవ తేదీన సుప్రీంకోర్టు ఎవరికి అనుకూలంగా “సిక్సర్” కొడుతుందో.. మరోపక్క ఎనిమిదవ తేదీన హైకోర్టు ఇచ్చే తీర్పు ఎవరికి “అష్ట”దిగ్బంధనం అవుతుందో అన్న ఉత్కంఠ కోర్టు తీర్పు వచ్చేవరకు కొనసాగనుంది.

More articles

Latest article