హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ “బాకీ కార్డు” మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు శనివారం విడుదల చేశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డదో.. ప్రభుత్వాన్ని నిలదీసి అడిగేందుకే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేశామన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి క్షేత్ర స్థాయి నాయకుల వరకు, అందరం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఈ బాకీ కార్డులను తీసుకెళ్లి ఇస్తామని పేర్కొన్నారు. రైతులకు రైతుబంధు, రుణమాఫీ.. కౌలు రైతులకు రూ.15,000, రైతు కూలీలకు రూ.12,000.. ఆటో అన్నలకు దాదాపు రూ.24,000. మహిళలకు నెలకు రూ.2500.. పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం, వృద్ధులకు నెలకు రూ.4,000.. చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు.. అన్ని రకాల వరికి క్వింటాకు రూ.500 బోనస్, చాలా మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్.. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యమకారులకు 250 చ.గజాల స్థలం.. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఇలా తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని తెలుపుతామని కేటీఆర్ పేర్కొన్నారు. మా మీద కేసులు పెట్టినా భయపడమని స్పష్టం చేశారు.


