- పది లక్షల విదేశీ కరెన్సీ
- పది తులాల బంగారం చోరీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాబన్ సహాడ్ ప్రాంతంలో నివాసం ఉండే నిషాత్ ఆఫ్రిన్ అనే మహిళ అర్సపల్లిలోని తమ బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో బుధవారం ఇంటికి తాళం వేసి వెళ్ళింది. గురువారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బీరువా ధ్వంసం చేసి వస్తువులన్నీ చిందరవందరుగా పడి ఉండడంతో అనుమానం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని పరిశీలించగా దుండగులు ఇంటి కిటికీ గ్రిల్లు స్క్రూ డ్రైవర్తో తొలగించి లోనికి ప్రవేశించి దోపిడీకి పాల్పడిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో సుమారు పది లక్షల వరకు విదేశీ(రియాల్స్) కరెన్సీ తో పాటు పది తులాలు బంగారం దోపిడీకి గురైనట్లు బాధితులు తెలిపారు. విషయం తెలియడంతో ఇది స్థానికుల దొంగల పని కాదని కిటికీ గ్రిల్ తొలగించి దోపిడీకి పాల్పడేది మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ముఠా దోపిడి చేశారని అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో సిసిఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఘటనా స్థలానికి వెళ్లి దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు. సహజంగా కిటికీ గ్రిల్ తొలగించి దోపిడీలకు పాల్పడేది అంతర్రాష్ట్ర ముఠాపనేనని ఏసీపి అనుమానాలు వ్యక్తం చేశారు. దోపిడి ముఠాను త్వరలోనే పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఘటన స్థలానికి ఐదవ టౌన్ ఎస్ హెచ్ ఓ గంగాధర్ తోపాటు క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
