కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా ప్రభుత్వ ఆసుప్రతిలో నవజాత శిశువు మృతి చెందడంతో బంధువులు ఆందోళన చేపట్టారు. తాడ్వాయి మండలం బ్రహ్మాజీ వాడి గ్రామానికి చెందిన అఖిల పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కుంటుంబ సభ్యులు శుక్రవారం అర్థరాత్రి ఆమెను జీజీహెచ్ కు తీసుకొచ్చారు. మొదటి కాన్పు కావడంతో నొప్పులు భరించలేక పోతుందని, ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలని వైద్యులను కుటుంబ సభ్యులు వేడుకున్నారు. వైద్యులు పట్టించుకోకుండా సాధారణ ప్రసవానికి ప్రయత్నించి కాన్సు చేశారు. ఆడపిల్ల పుట్టడంతో మహాలక్ష్మీ పుట్టిందని సంబరపడే లోపు పుట్టిన శిశువులో చలనం లేదు. మృత శిశువు జన్మించిందని వైద్యులు చెప్పడంతో అర్థరాత్రి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. తాము చెప్పినట్లు ఆపరేషన్ చేస్తే బిడ్డ బతికేదని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ కడుపులోనే మృతి చెందిందని ఆరోపించారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ ను వివరణ కోరగా ప్రసవం సమయంలో వైద్యుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదన్నారు. ఉమ్మనీరు మింగడంతోనే శిశువు మృతి చెందిందని తెలిపారు.
