కామారెడ్డి, బతుకమ్మ : జిల్లాలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈనెల 15న పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర భద్రతా ఏర్పాట్లు పరిశీలించి, పోలీసు అధికారులకు సూచనలు చేశారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంతం, ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు, విఐపి రాకపోకల మార్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీ రాకపోకలు, భద్రతా చర్యలు కఠినంగా అమలు చేయాలని, ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాల్లో సైన్ బోర్డులు, దిశా సూచికలు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని, ప్రతి విభాగంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్ దేవునిపల్లి ఎస్సై రంజిత్ తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

