24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పెద్దగుట్ట భూములకు ఎసరు

Must read

📰 Generate e-Paper Clip

  • 20 ఎకరాల భూముల ఆక్రమణ
  • పోచారం అనుచరులపై కలెక్టరేట్ లో ఫిర్యాదు

 

నిజామాబాద్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ శివారులోని పెద్దగుట్ట భూములపై ఆక్రమార్కుల కన్నుపడింది. అక్కడ అటవి భూమిని ఆనుకుని ఉన్న దర్గా భూములపై కొందరి కన్నుపడడంతో  రాత్రికి రాత్రే ఆక్రమణలు షురూ అయ్యాయి. దానితో సంబంధిత భూమిని రక్షించాలని కోరుతూ బైరాపూర్ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అటవి అధికారులు సంబంధిత భూమి తమ పరిధిలోది కాదని, రెవెన్యూ అధికారులు మాత్రం సంబంధిత భూమి ఆక్రమణలు తేల్చేందుకు రెండు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలతో భూ ఆక్రమణ వివాదం తెరపైకి వచ్చింది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులే భూ కబ్జా చేస్తున్నారని ఆయన వ్యతిరేకవర్గం ఏకంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామం శివారులో పెద్దగుట్ట ఉంది. అక్కడ అటవి ప్రాంతానికి ఆనుకుని ఉన్న 20 ఎకరాల భూమిని ఆక్రమిస్తున్నారని మాజీ సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బైరాపూర్ గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన వంద మందికి పైగా ప్రజలు తమ ప్రాంతానికి చెందిన భూమిని మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో గత ప్రభుత్వ హయంలోనూ పోచారం అనుచరులు చాలా భూములను చెరబట్టారన్న ఆరోపణలున్నాయి. స్థానికంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి హయంలో నిర్మితమైన ప్రముఖ ప్రార్థన క్షేత్రం సమీపంలోని భూములు కబ్జాకు గురయ్యాయన్న వాదనలున్నాయి. ఇటీవల కాలంలో బాన్సువాడ మీదుగా బోధన్ వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణం పనుల కోసం మొరం, కంకర, గ్రానైట్ల కొరకు భూ కబ్జాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తరించి బాన్సువాడ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పోచారం, ఏనుగు వర్గీయులు నువ్వానేనా అన్నరీతిలో తలపడుతున్నాయి. ఇటీవల కాలంలో బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారంపై అనర్హత వేటు పడడం ఖాయమని ఉప ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ కోసం రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. పోచారం వర్గం ఇప్పటికే ఏనుగు రవీంధర్ రెడ్డి వర్గీయులను పార్టీ నుంచి సస్పెండ్ చేయించడంలో సఫలమైంది. అదే సమయంలో బాన్సువాడ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి బరిలో దిగేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉప ఎన్నికల సంగతి దేవుడెరుగు కానీ నియోజకవర్గంలో పోచారంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏనుగు రవీంధర్ రెడ్డి అన్ని దారులను వెతుకుతున్నారు. ఎలాంటి అవకాశం వచ్చినా పోచారం అనుచర వర్గంను అణచివేసేందుకు శాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. అదే కోణంలో బైరాపూర్, పెద్దగుట్ట భూముల ఆక్రమణల ఆంశాలను ఎత్తుకుని ఫిర్యాదులు చేయిస్తున్నాడన్న వాదనలున్నాయి. అధికార యంత్రాంగం భూముల కబ్జాను తేలుస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

More articles

Latest article