29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్ ఎఫెక్టెడ్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్స్

Must read

📰 Generate e-Paper Clip

  • నోటీసులతో సరిపెడుతున్న ఎంక్రోచ్ మెంట్ టీంలు
  • టౌన్ ప్లానింగ్ లో కాసుల వర్షం
  • కమర్షియల్ భవనాలకు లక్షల్లో వసూళ్లు

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి, అక్రమాలకు అంతులేకుండాపోతుంది. ఇటీవల ఏసీబీ అధికారులు బల్ధియాలోని రెవెన్యూ విభాగంపై తనిఖీలు నిర్వహించి లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్ పెక్టర్ ను పట్టుకున్న విషయం విధితమే. నిజామాబాద్ బల్ధియాలో రెవెన్యూ తర్వాత అంతకుమించి వసూళ్ళు జరుగుతున్న ఏకైక డిపార్ట్ మెంట్ గా టౌన్ ప్లానింగ్ విభాగమనే చెప్పాలి. అక్కడ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఆఫీసర్లు మొదలుకుని చైన్ మెన్ ల వరకు అందిన కాడికి దండుకుంటున్నారు. మాస్టర్ ప్లాన్ లేకపోవడం వారికి కలిసి వస్తుంది. గత ప్రభుత్వ హయంలో మాస్టర్ ప్లాన్ రూపొందించిన అది డ్రాప్ట్ కే పరిమితమై ప్రభుత్వం ఆమోదించకపోవడంతో మాస్టర్ ప్లాన్ పేరు చెప్పి దండుకునే ప్రక్రియ టౌన్ ప్లానింగ్ లో జరుగుతుంది.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏమైనా నూతన భవనం నిర్మించాలంటే దానికి మాస్టర్ ప్లాన్ ప్రకారమే భవన నిర్మాణం జరుగాలి. అందుకు కమర్షియల్ అయితే 30 ఫీట్ల రోడ్డు కచ్చితంగా ఉండాలి. సెట్ బ్యాచ్ తో పాటు సెల్లార్ నిర్మాణాలు ఉండాల్సిందే. అంతేగాకుండా మాస్టర్ ప్లాన్ ప్రకారం భవిష్యత్తులో రోడ్ల విస్తరణ జరిగితే దానిని అంగీకరిస్తూ భవనాన్ని నిర్మించే యజమాని రోడ్డు ఎఫెక్టెడ్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ను బల్ధియా పేరున చేయాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్తులో రోడ్ల విస్తరణ గానీ లేదా అక్రమాణలు అని తేలితే వాటిని కూల్చివేసే అధికారాన్ని స్వయంగా యజమాని అంగీకరిస్తూ కమిషనర్ పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖలీల్ వాడి,ద్వారక్ నగర్, సరస్వతినగర్, శ్రీనగర్, హైదరాబాద్ రోడ్డు, ఆర్మూర్ రోడ్డు, బోధన్ రోడ్డు, వర్ని రోడ్డు, బైపాస్ రోడ్డు ప్రాంతాలలో చేసిన రోడ్డు ఎఫెక్టెడ్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు బుట్టదాఖలవుతున్నాయి. పేరుకే రిజిస్ట్రేషన్ చేయించుకున్న అధికారులు దానిని పట్టించుకోకపోవడంతో అక్కడ భవన నిర్మాణాలను చేస్తున్నారు. డైరెక్ట్ గా వారే కబ్జా నిర్మాణం చేసి భవిష్యత్తులో అధికారులు అడ్డుకుంటామంటే అనుమతులు ఇచ్చింది మీరే అనే పరిస్థితి తెచ్చిపెట్టారు.

నిజామాబాద్ నగరంలోని కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ విభాగంలో కాసులు కురిపిస్తున్నాయి. దరఖాస్తుదారు ఎఫెక్టేడ్ ఏరియాను వదిలి నిర్మాణం చేయడం లేదని తెలిసి నోటీసులు ఇచ్చే అధికారులు తర్వాత వాటిని పట్టించుకోవడం లేదన్న వాదనలున్నాయి. టౌన్ ప్లానింగ్ పరిధిలో జరిగే అక్రమ  నిర్మాణాలు, భవనాలను కూల్చివేసేందుకు రెవెన్యూ, టౌన్ ప్లానింగ్,  ఫైర్, నీటి పారుదల శాఖ అధికారులతో కూడిన ఎన్ క్రోచ్ మెంట్ టీం పరిశీలన చేసి అనుమతివ్వాలి. కానీ ఆ టాస్క్ ను చేసే తీరిక టాస్క్ ఫోర్స్ టీంకు లేకుండాపోయింది. 2019 నుంచి ఇప్పటి వరకు అలాంటి ఫైళ్ళు చాలానే పెండింగ్ లో ఉన్నాయి. నిర్మాణాలు జరిగి భవనాలు ప్రారంభించుకోవడం జరిగిన పట్టించుకోవడం లేదు. కానీ ఈ వ్యవహరంలో లక్షల వసూళ్ళ కార్యక్రమం నిత్యతంతుగా మారింది. నిజామాబాద్ నగర నడిబొడ్డున నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు పెరుగుతుంటే టౌన్ ప్లానింగ్ లో టీపీవోలు మొదలుకుని టీపీబీవోల వరకు తమ పరిధి కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న వాదనలున్నాయి. అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా ఫిర్యాదు చేసిన వారి సమాచారాన్ని కూడా లీక్ చేస్తున్న వాదనలున్నాయి. అక్రమణలు కూల్చివేసిన దాఖలాలు లేవు కానీ అందిన కాడికి పిండుకుంటున్నారని బల్ధయా అంతా కోడై కూస్తోంది.

More articles

Latest article