- రిమాండ్ కు తరలింపు
- జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ : రాజస్థాన్ నెంబర్ ప్లేట్ వాహనంతో జిల్లా లో దొంగతనాలు చేస్తున్న మధ్యప్రదేశ్ కు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మర్కల్ గ్రామానికి చెందిన గుండ్రెడ్డి గంగాధర్ తన అత్తగారు పని నిమిత్తం హైదరాబాద్ వెళ్ళగా, ప్రతిరోజు తన భార్య అత్తగారి ఇల్లును పరిశీలించేది. జులై 19 న ఉదయం వెళ్లి చూసేసరికి గేటు, ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువా విరగగొట్టి అందులోని రెండు తులాల బంగారు చైన్, రూ.25,000 నగదు దొంగిలించబడినట్లు ఫిర్యాదుదారు పిటిషన్ ఇచ్చారు. ఆదేవిధంగా అదే గ్రామానికి చెందిన గుర్రపు మహేష్ తన పాత ఇంటిలో కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా, జులై 18న షాపు మూసి ఇంటికి వెళ్లి, ఉదయం వచ్చి చూసేసరికి షాపు తాళం పగలగొట్టి, కౌంటర్ నుండి రూ.12,000 నగదు, రెండో గదిలోని బీరువా నుండి రెండు తులాల పుస్తెలతాడు, మూడు జతల వెండి పట్టగొలుసులు దొంగిలించబడినట్లు మరో ఫిర్యాదు కూడా వచ్చింది. ఈ సంఘటనలపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సీసీటీవీ కెమెరాల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలను పరిశీలించారు. ఈ క్రమంలో మంగళవారం నమ్మదగిన సమాచారం మేరకు కల్వరాల స్టేజ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు గమనించి ఒక వ్యక్తి తన కారును వెనక్కి తిప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు వెంబడించి పట్టుకొని విచారించగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నిముచి జిల్లా మనసా తాలుకాలోని బారడియా గ్రామానికి చెందిన సికిందర్ సొన్లాల్ దర్బార్ గా వెల్లడించారు. జులై 18న రాత్రి 9 మంది వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి కామారెడ్డి జిల్లా పరిధిలో దొంగతనాలకు పాల్పడినాడని తిరిగి మరలా దొంగతనాలు చేయడానికి అనుకూలంగా ఉండే స్థలాలను రెక్కి చేయడానికి రాగా పోలీసులు పట్టుకున్నారు. విచారణలో సికిందర్ సొన్లాల్ దర్బార్ అతని స్నేహితులు సంజు, విశాల్, అభిషేక్, ప్యూస్, అనిల్, ఉమేశ్ భాయ్, గోవింద భాయ్ లతో కలిసి ఒక (9) మంది సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆర్జే-27-యూసీ-2116 ఎర్టిగా కారు ను కొనుగోలు చేసి దొంగతనాలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపాడు. ఎవరైనా నేరాలు చేయు సమయములో అడ్డుపడినట్లయితే కత్తులు, రాడ్లు చూపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అవసరమయితే వారి ప్రాణాలకు హాని చేసి దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితుని వద్ద నుంచి ఒక ఫోన్, కారు, కత్తి, టర్చ్ లైట్, కట్టింగ్ ప్లేయర్, రూ.2,600నగదు స్వాధీనం చేసున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్, ఎస్సైలు పుష్పరాజ్, సిసిఎస్ ఉస్మాన్, ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిసిఎస్ కానిస్టేబులు శ్రీనివాసు, లక్ష్మీకాంత్, మైసయ్య, శ్రావణ్, సదాశివ నగర్ క్రైమ్ పార్టీకి చెందిన రవిని జిల్లా ఎస్పీ అభినందించారు.


