25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీ లకు 42% రిజర్వేషన్ వెంటనే ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

  • డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్

 

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ (బీసీ) హక్కుల కోసం పోరాటం మళ్లీ బలంగా వినిపిస్తున్న తరుణంలో బీసీ లకు 42%రిజర్వేషన్ వెంటనే ఇవ్వాలని ప్రముఖ వైద్య నిపుణుడు, సామాజిక న్యాయ యోధుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన బతుకమ్మ తో మాట్లాడుతూ
బీసీలు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్నా, వారికి దక్కాల్సిన న్యాయం ఇంకా దక్కడం లేదని, ఇపాటికైన 42% రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలన్నారు. ఇది బీసీ సమాజానికి హక్కు, హామీ కాదు” అని ఆయన ధ్వనించారు.

బీసీలు – రాష్ట్రానికి వెన్నెముక..

తెలంగాణలో బీసీలు ఎప్పటి నుంచీ వ్యవసాయం, శ్రమ, చిన్న వృత్తులు ఆధారంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నారన్నారు. కానీ రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో నిర్లక్ష్యం, అన్యాయం ఎదుర్కొంటూనే ఉన్నారని, వారి చెమటతో రాష్ట్రం నిలబడి ఉందని, ఇప్పుడు వారి స్వరంతో పాలనలో సమానత్వం సాధించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే సర్వేలు, కమిషన్‌ల ఆధారంగా బీసీలు 55% వరకు ఉన్నారని అంగీకరించిందని, ఆ సాక్ష్యాల ఆధారంగానే 42% రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందన్నారు. అయినప్పటికీ ఆర్డినెన్స్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండడం బీసీ సమాజాన్ని ఆగ్రహానికి గురిచేస్తోందని, “చట్టం పేరుతో ఆలస్యం చేస్తూ ప్రజల హక్కులు వాయిదా వేయడం అన్యాయం” అని రాజ్‌కుమార్ ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని సామాజిక న్యాయంగా చూపుతూ ముందుకు సాగుతుండగా, బీఆర్‌ఎస్, బీజేపీ లీగల్ సమస్యల పేరుతో సందేహాలు పెడుతున్నాయన్నారు. దీనిపై ఎన్నికల లెక్కలు చూసి మాటలు చెప్పే సమయం కాదని, ఇప్పుడు బీసీల హక్కు అమలు చేయాలని, ముస్లింలు సహా అన్ని గ్రూపులు (ఏ నుండి ఈ వరకు) సమానంగా లాభపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.
“బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తేనే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిజమైన ప్రజాస్వామ్యం వికసిస్తుందని, బీసీ హక్కులను కాపాడటం అంటే తెలంగాణ భవిష్యత్తును బలపరచటమేనన్నారు.
42% రిజర్వేషన్ అమలు బీసీలకు మాత్రమే కాదని, అది సామాజిక సమానత్వానికి చిహ్నమన్నారు. దీన్ని వాయిదా వేయడం అంటే ప్రజాస్వామ్యానికి నష్టమని, బీసీ కమ్యూనిటీ సమాజానికి కొత్త శక్తి, కొత్త దిశగా మారిందని, ఇప్పుడు బీసీల న్యాయం సాధించటమే ప్రభుత్వానికి నిజమైన పరీక్ష అన్నారు.

More articles

Latest article