- జిల్లా యంత్రాంగానికి మార్గనిర్దేశం చేసిన మంత్రి సీతక్క
- సంక్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేసిన జిల్లా యంత్రాంగానికి అభినందనలు – మంత్రి సీతక్క
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, ఉమ్మడి నిజాంబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్ట్కర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఫైర్ అదనపు డీజీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు అనేకమంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారని, క్లౌడ్ బరస్ట్ కారణంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఏర్పడిన భయంకర వరద పరిస్థితులను ఎదుర్కొని ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని పేర్కొన్నారు. హాస్టల్లో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను రక్షించడం, పోచారం డ్యామ్ కింద మునిగిపోయిన 14 గ్రామాల ప్రజలను రాత్రికి రాత్రే పునరావాస కేంద్రాలకు తరలించడం వంటి చర్యలు అధికారుల కృషి, సమన్వయానికి నిదర్శనమని మంత్రి అభినందించారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం అందిందని తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి గారు స్వయంగా రివ్యూ చేయలేకపోయారని మంత్రి సీతక్క వివరించారు. రోడ్లు, చెరువుల కట్టలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలకు తెలియజేయాలని, ప్రమాదకర రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేయాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ పనులు వేగవంతం చేసి వ్యాధులు ప్రబలకుండా చూడాలని, ఇండ్లలోకి చేరిన నీటిని తొలగించి శుభ్రపరచాలని ఆదేశించారు. వరద ప్రభావంతో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలు నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని సూచించారు. మండల స్థాయికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని, వాగులు, చెరువుల కింద ఉన్న గ్రామాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ నష్టం జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పని చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. కామారెడ్డి జిల్లా ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా వరద బీభత్సాన్ని చవిచూసిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో చక్కగా పనిచేసిన జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నానని మంత్రి సీతక్క అన్నారు.

