- రాష్ట్ర కమిటీలో మా వాటా పదవులు ఇవ్వాల్సిందే
- బీజేపీ చీఫ్ ను డిమాండ్ చేసిన ఎంపీ అరవింద్
నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాల్లో దక్కని ఓటింగ్ శాతం నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో దక్కిందని, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు 50 శాతంకు మించి ఓటింగ్ ను సాధించిన నిజామాబాద్ కు రాష్ట్ర కమిటీలో వాటా పదవులు ఇవ్వాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు ను కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం ఓటింగ్ దాటించాలని లక్ష్యంగా పని చేస్తే 48 శాతం ఓట్లు వచ్చాయని జగిత్యాల్లో కూడా రాబోయే రోజుల్లో 50 శాతం ఓట్లను సాధిస్తామని గుర్తు చేశారు. కార్యకర్తల వల్లనే పార్టీకి బలమని, ఎవరి గెలుపైనా వారే నిర్ణాయత్మాక శక్తి అన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను తీసుకున్న రామచంద్రరావు కొత్త రక్తంను ప్రోత్సహించాలని సూచించారు.

పార్టీ అధికారంలోకి రావాలంటే ఇతర పార్టీల నుంచి యువ రక్తాన్ని పార్టీలో చేర్చుకోవాలని , మమ్మల్ని ఉపయోగించుకోవాలని, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అరవింద్ కోరారు. తాను పొగరుబోతునని పార్టీలోకి కొత్త వారిని రానివ్వనని కొందరు దుష్ర్పచారం చేశారని ప్రస్తుత ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తే కొందరు అడ్డుపుల్లలు వేశారన్నారు. మోడి భక్తుడిని కాబట్టే పొగరుతో ఉంటానని, పార్టీ ఎదుగుదలను అడ్డుకునే వారికి నేను పొగురుతోనే సమాదానం చెబుతానని అరవింద్ అన్నారు. అరవింద్ కు అహంకారం ఉందంటూ ఆరోపణలు చేస్తున్న వారికి తాను పార్టీలో చేరిన తర్వాత ఇతర పార్టీల నుంచి జాయిన్ అయిన వారికి పార్టీ సాధించిన విజయాలే సమాదానం అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా పరిషత్ స్థానాన్ని బీజేపీ అధినాయకత్వానికి గిఫ్ట్ గా ఇస్తామని, మొన్ననే మున్సిపల్ మేయర్ స్థానం త`టిలో తప్పిందని త్వరలో దానిని గెలిచి తీరుతామన్నారు. పార్టీ పరంగ కష్టపడి పని చేస్తున్న జిల్లా బీజేపీ నాయకులకు, రాష్ట్ర కార్యవర్గంలో మా వాటా మాకు కేటాయించాలని అన్నారు. 2018 ఎన్నికల్లో 18 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్న కాంగ్రెస్ నాయకులు అప్పుడేందుకు మాట్లాడలేదో ఉత్తమ్ ను ప్రశ్నించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సూచించారు. దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదని, దానిని ఎందుకు ఇప్పటి వరకు ఇవ్వాలేదో కాంగ్రెస్ నాయకులు సమాదానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ కు ముస్లీంల కోసం ప్రేమ పుడుతుదని, బీసీలపై ప్రేమ లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తుందని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కాషాయ జండా ఎగురవేయడం ఖాయమన్నారు.

