26.6 C
Hyderabad
Monday, August 3, 2026

నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేష్

Must read

📰 Generate e-Paper Clip

  • రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ.గౌతమ్ కితాబు

 

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేషుగ్గా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ.గౌతమ్ జిల్లా యంత్రాంగం పనితీరును ప్రశంసించారు. ప్రత్యేకించి గడిచిన రెండు నెలల నుంచి ఇళ్ల నిర్మాణాలలో జిల్లా గణనీయమైన వృధ్ధి సాధించిందని, రెండవ విడత ఇళ్ల మంజూరీ, గ్రౌండింగ్ లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ పురోగతి సాధించారని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డిని, సంబంధిత శాఖల అధికారులను అభినందించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డీ వీపీ.గౌతమ్ బుధవారం నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లి, డిచ్పల్లి మండలం ఘన్ పుర్ గ్రామాలలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్దిదారులను కలిసి ఉచితంగా ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపులు, మేస్త్రీల చార్జీలు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా దశల నిర్మాణాలను బట్టి వెంటదివెంట బిల్లులు చెల్లిస్తున్నామని, త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై  మున్సిపల్ కమిషనర్లు, ఎం.పీ.డీ.ఓలు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో హౌసింగ్ ఎం.డీ గౌతం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల క్షేత్రస్థాయి పరిస్థితి గురించి ఒక్కో మండలం వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎం.డీ కి వివరించారు. జిల్లా వ్యాప్తంగా 19,306 ఇళ్ళను కేటాయించాలని లక్ష్యం కాగా, 17,291 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. వాటిలో 9,360 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని, 5,541 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని అన్నారు. వీటిలో 4,647 ఇండ్లు బేస్మెంట్ దశలో, 665 ఇండ్లు గోడల దశలో,  229 గృహాలు స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని తెలిపారు. ఆయా దశల నిర్మాణాలను పరిశీలిస్తూ, లబ్దిదారులకు వెంటవెంటనే బిల్లులు మంజూరు చేయడం జరుగుతోందని అన్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు ఆర్ధిక స్థోమత లేని లబ్దిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా లక్ష రూపాయల వరకు రుణం అందిస్తూ, నిర్మాణ పనులు చేపట్టేలా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2,637 మంది లబ్దిదారులకు రూ. 30.07 కోట్ల రుణాలు ఇప్పించామని, లబ్దిదారులను తామే రుణం కోసం సంప్రదిస్తూ, కొత్త వారికి మహిళా సంఘాలలో సభ్యత్వం కల్పిస్తూ రుణ సదుపాయం వర్తించేలా చొరవ చూపుతున్నామని అన్నారు. ఫలితంగా లబ్దిదారులు ఇంటి నిర్మాణాలకు ఆశించిన స్థాయిలో ముందుకు వస్తున్నారని తెలిపారు. అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నప్పటికి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సుముఖంగా లేని వారి నుండి రాతపూర్వకంగా లేఖలు తీసుకుని, వారి స్థానంలో ఆర్హులైన ఇతరులకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డీ వీ.పీ.గౌతమ్ మాట్లాడుతూ, అర్హులైన వారి పేర్లు ఇందిరమ్మ లబ్దిదారుల జాబితా నుండి రద్దు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా పూరి గుడిసెలు, పక్కా ఇల్లు లేని వారిని ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు హితవు పలికారు. ఇందిరమ్మ కమిటీల సహకారం తీసుకుని అర్హులైన లబ్దిదారులు అందరూ ఇంటి నిర్మాణం చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని సూచించారు. అదే సమయంలో అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకుండా నిశిత పరిశీలన జరపాలని, ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లకు కూడా తలొగ్గకుడదని ఎం.డీ గౌతమ్ స్పష్టం చేశారు. ఇళ్ళ మంజూరీలో ఏ చిన్న తప్పిదం జరిగినా, అందుకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ఇసుక సమస్య తలెత్తకుండా హౌసింగ్ అధికారులు తహసిల్దార్మ ఎంపీడీవోలతో సమన్వయం చేసుకొని  ఉచితంగా ఇసుక టోకెన్లు అందించాలని, ప్రభుత్వం నిర్ణయించిన మేరకే రవాణా చార్జీలు వసూలు చేసేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. దీనివల్ల ఇంటి నిర్మాణంలో లబ్ధిదారుల పైన ఎక్కువగా ఆర్ధిక భారం పడకుండా ఊరటను అందించినట్లు అవుతుందని అన్నారు. కంకర, ఐరన్, సిమెంటు, ఇటుకలు ఇతర సామాగ్రి నిర్ణీత ధరలకే లబ్దిదారులకు అందించేలా మండల స్థాయి ధరల నియంత్రణ కమిటీ చర్యలు తీసుకోవాలని, మేస్త్రీలు నిర్ధారిత రుసుమును మాత్రమే నిర్మాణ చార్జీల కింద తీసుకునేలా చూడాలన్నారు. ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులకు ఎలాంటి నిధుల కొరత లేదని, వారం వారం లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడం జరుగుతోందని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో తలెత్తున్న సాంకేతిక సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరిగిందని అన్నారు. బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్, పేర్ల నమోదు వంటి వాటిలో తప్పిదాల కారణంగా బిల్లుల చెల్లింపులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండడంతో ఆధార్ కార్డు ఆధారంగా చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. లబ్దిదారుల ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలోకి బిల్లు మొత్తం జమ అవుతుందని, వచ్చే వారం రోజులలోపు ఈ ప్రక్రియ అమలులోకి రానుందని ఎం.డీ గౌతమ్ వెల్లడించారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల వివరాలను ప్రధాన మంత్రి ఆవాస్ పోర్టల్ లో వెంటవెంటనే అప్లోడ్ చేయాలని, జియో ట్యాగింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అర్హులైన వారికి కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అర్బన్ ప్రాంతాలలో రెండు పడక గదుల అసంపూర్తి నిర్మాణాలను చేపట్టేందుకు, మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో దృష్టికి వచ్చిన పలు సాంకేతిక ఇబ్బందులను ఎం.డీ దృష్టికి తేగా, వాటిని తక్షణమే పరిష్కరిస్తామని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అభయహస్తం కాలనీలో 4.32 ఎకరాల ప్రభుత్వ స్థలంలో జీ+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి లబ్దిదారులకు అందించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఇదే స్పూర్తితో పనిచేస్తూ, ఇందిరమ్మ లబ్దిదారులు అందరూ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకునేలా కృషి చేయాలని హౌసింగ్ ఎం.డీ గౌతమ్ సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావి, జెడ్పి సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీ.డీ రాజేందర్, హౌసింగ్ జిల్లా పీ.డీ పవన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ ఈ.ఈలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడీఓలు, హౌసింగ్ ఏ.ఈలు తదితరులు పాల్గొన్నారు.

Progress in construction of Indiramma houses in Nizamabad district is excellent.

More articles

Latest article