నందిపేట్, బతుకమ్మ : ట్రాన్స్ ఫార్మర్ వద్ధ కరెంటట్ పనులు చేస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్ తో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం నందిపేట్ మండలం వన్నేల్( కే) మారంపల్లి రోడ్డులోని ఎర్రగుంట చెరువు వద్ద జరిగింది. నందిపేట్ మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన దంతాల రాజేంధర్ గత 15 సంవత్సరాలుగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. మండలంలోని మూడు గ్రామాలలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా విద్యుత్ శాఖ అధికారులతో పాటు, స్థానిక గ్రామాల రైతులకు, ప్రజలకు సుపరిచుతుడు. ఆదివారం మధ్యాహ్నం ఎర్రగుంట చెరువు వద్ద ఉన్న విధ్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద దంతాల రాజేంధర్ (27) పనిచేస్తుండగా విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తల్లి పిర్యాదు మేరకు నందిపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- ఎల్ సి తీసుకోకుండా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద రిపేర్ చేస్తున్నాడా..?
నందిపేట్ మండలం నూత్ పల్లి సెక్షన్ పరిధిలోని వన్నేల్( కే) మారంపల్లి రోడ్డులోని ఎర్రగుంట చెరువు వద్ద ట్రాన్స్ ఫార్మర్ వద్ధ మరమ్మత్తులు చేస్తూ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ విద్యుత్ ఘాతంతో మృత్యు వాత పడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా విద్యుత్ సరఫరాలో లోపాలు కాని, స్థంబాల వద్ద చిన్నా చితక పనులకు విద్యుత్ శాఖాధికారుల ద్వారా ఎల్ సి తీసుకోని పనులు చేయడం రివాజు. ఎల్ సి సైతం లైన్ మెన్ మొదలుకొని సంబంధిత సెక్షన్ ఎఇలకు సమాచారం ఇచ్చిన తరువాతనే ఎల్ సి ఇస్తారు. అప్పుడు మాత్రమే విద్యుత్ స్థంబాలను ఎక్కడం మరమ్మత్తులు చేస్తారనే విషయం అందరికి తెలిసిందే. గత 15 సంవత్సరాలుగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా సుపరిచితుడు ఐనా రాజేంధర్ అధికారుల అనుమతి తీసుకోకుండా ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ మరమ్మత్తులకు ఉపక్రమించాడా అంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతుల పనుల కోసం వెళ్లిన అక్కడ రైతులు ఎవ్వరు ముందుకు రాకపోవడంతో విద్యుత్ శాఖ లైన్ మెన్ తో పాటు సెక్షన్ వారికి తెలిసిన తరువాతనే రిపేర్ కు దిగాడా అనే సంశయాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నామని చెబుతుండగా, విద్యుత్ శాఖాధికారులు తమకు ఎవ్వరికి సమాచారం లేదని ఖరాకండిగా చెబుతున్నారు.

