. గణనాథుని సేవలో తరిస్తున్న ముస్లిం వ్యాపారి
. రెండు వార్డుల్లో సమస్యలను పరిష్కరిస్తున్న పాషా
బిచ్కుంద, బతుకమ్మ: హిందూముస్లింల ఐక్యత కోసం పాటుపడుతున్నాడు మండల కేంద్రానికి చెందిన వ్యాపారి పాషాసేట్. ప్రతి ఏడాది మండల కేంద్రంలో నిర్వహిస్తున్న గణేశ్ ఉత్సవాల్లో పాల్గొంటున్నాడు. స్థానిక శ్రీరామసేన గణేశ్ మండలికి రూ.11వేల చొప్పున చందా ఇవ్వడంతోపాటు అన్నదానంలోనూ పాలుపంచుకుంటున్నాడు. అలాగే మండల కేంద్రంలోని 14, 15 వార్డుల్లో ఏ సమస్య నెలకొన్న దగ్గరుండి సమస్యను పరిష్కరిస్తారని పాషా సేట్ సేవలను స్థానికులు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా పాషా సేట్ మాట్లాడుతూ.. ఎవరి భక్తి వాళ్లకు గొప్పగా ఉంటుందని, దేవుడు అందరికి వివిధ రూపాల్లో దర్శనం ఇస్తారని చెప్పుకొచ్చాడు. హిందూ ముస్లింలు అనే బేధం మనం ధరించే వేషానికే తప్ప.. మనసుకు మాత్రం అందరం ఒక్కటే అందరి దేవుడు ఒక్కడే అని పాషా అన్నారు. ప్రతి ఏడాది గణేశ్ నిమజ్జనానికి భోజనం ఏర్పాటు చేయడం, వారి సంస్కృతిలో భాగం కావడం ఆ అల్లా తనకు ఇచ్చిన గొప్ప వరమంటున్నాడు. కార్యక్రమంలో పాషాసేట్ తో పాటు ఆయన కుమారుడు అమన్, 14వ వార్డు కాలనీవాసులు పాల్గొన్నారు.

