. . . నోరు మెదపని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు
. . . పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల పబ్లిక్ టాయిలెట్స్ కూల్చివేయడం కలకలం రేపింది. జిల్లా పరిషత్ కార్యాలయం వెనుక భాగంలో పాములబస్తీ రోడ్డులో గత ప్రభుత్వ హయంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ వలన తమ భవనం అందం దెబ్బతినడంతో పాటు అక్కడ న్యూసెన్స్ గా మారే అవకాశం ఉందని కూల్చివేసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పేరషన్ ఆధ్వర్యంలో నగరంలోని పబ్లిక్ టాయిలెట్ల నిర్వాహణకు ప్రైవేట్ కాంట్రాక్టర్ కు అప్పగించారు. వాటి నిర్వాహణ సంగతి కూడా బల్ధియా అధికారులు విస్మరించారు. ప్రతి నెల 3 లక్షలకు పైగా కాంట్రాక్ట కు చెల్లిస్తున్నా కార్పొరేషన్ అధికారులు పబ్లిక్ టాయిలెట్ల నిర్వాహణను అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కిలో మీటర్ దూరంలోనే పబ్లిక్ టాయిలెట్ ను ప్రైవేట్ వ్యక్తులు రాత్రికి రాత్రే కూల్చివేస్తే టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ విభాగం గుర్తించకపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నగరంలో ఓ కార్పొరేట్ విద్యా సంస్థ సుభాష్ నగర్ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఉమెన్స్ కాలేజి నిర్వాహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. విద్యార్థినిలు రోజు వచ్చేపోయే దారిలో పబ్లిక్ టాయిలెట్లు ఉంటే ఆకతాయిలతో పాటు స్థానికంగా న్యూసెన్స్ అవుతుందేమోనని ముందు జాగ్రత్తగా కూల్చివేయించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దశాబ్ధ కాలంగా అక్కడ పబ్లిక్ టాయిలెట్ ఉండగా గతంలో ఎక్సైజ్ శాఖ కూడా పబ్లిక్ టాయిలెట్ల పై అభ్యంతరం వ్యక్తం చేసినా దానిని బల్ధియా తొలగించలేదు. స్థానికంగా ఉన్న స్లమ్ ఏరియాలో సొంతంగా టాయిలెట్లు లేకపోవడంతో బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని గతంలో అక్కడ పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు. నీటి సౌకర్యంతో పాటు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి అందుబాటులోకి తేవడంతో బహిరంగ మలవిసర్జనకు బ్రేక్ పడింది. కానీ రాత్రికి రాత్రే పబ్లిక్ టాయిలెట్ ను కూల్చివేయడంతో అక్కడ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది.
నిజామాబాద్ నగరంలో పబ్లిక్ టాయిలెట్లను, సులబ్ కాంప్లెక్స్ లను ప్రైవేట్ వ్యక్తులు కూల్చివేసే కల్చర్ దశాబ్ధ కాలంగా కొనసాగుతుంది. గత వారం సుభాష్ నగర్ లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ ను కూల్చివేసినా ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో న్యాల్ కల్ చౌరస్తా (ఆర్ఆర్ చౌరస్తా)లో ఆనాటి అధికార పార్టీ నేత తన భవనానికి ఆనుకుని బల్ధియా స్థలంలో నిర్మించిన సులబ్ కాంప్లెక్స్ ను రాత్రికి రాత్రే కూల్చివేశారు. బహిరంగంగా నాలుగు రోడ్ల చౌరస్తాలో సులబ్ కాంప్లెక్స్ ను కూల్చివేసిన ఆనాడు అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి బల్ధియా అధికారులు సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం కూడా పబ్లిక్ టాయిలెట్ ను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయగా అక్కడికి బల్ధియా అధికారులు, నుడా అధికారులు, టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ అధికారులు పరిశీలించినా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బాధ్యులపై చర్యలకు సిఫారసులు చేశారనే దానికి సమాదానాలు లేవు. ప్రజల సొత్తుతో, ప్రజల కోసం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ ను కూల్చివేస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి అధికార పార్టీ లీడర్లే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలున్నాయి.

