- బాసర ట్రిపుల్ ఐటీలో బీసీ విద్యార్థులకు అన్యాయం
- తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అగ్రవర్ణాలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లను వెంటనే రద్దు చేసి, ఆ కోటాను బీసీలకు వర్తింపజేయాలని తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్సుకు ఎవరైనా అడ్డుపడితే, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రిపుల్ ఐటీ బాసర విశ్వ విద్యాలయ అడ్మిషన్లలో బీసీ బిడ్డలకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 564మార్కులకు కటాఫ్ ఉండగా, బీసీ ఏ కేటగిరీలో 571మార్కులు, బీ కేటగిరీలో 578మార్కులు, సీ కేటగిరీలో 566మార్కులు, డీ కేటగిరీలో 579మార్కులకు కటాఫ్ జరిగిందని, బీసీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయానికి బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియనే నిదర్శనమని లెక్కలతో వివరించారు. రిజర్వేషన్ల ఉద్యమంలో రాజీలేదని, త్వరలో లక్షలాది బీసీలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతకముందు ఆయనను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హెచ్.రేవంత్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కరిపే రవీందర్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కె. నాగరాజు, ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ డివిజనల్ కార్యాలయ సూపరింటెండెంట్ పోల శ్రీనివాస్, నీటిపారుదల శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
