భీమ్ గల్, బతుకమ్మ : పాడి,పంట, గొడ్డు, గోదా బాగుండాలని, అంటువ్యాధులు దరిచేరకూడదని వేడుకొంటూ మండలంలోని మెండోరా గ్రామంతో పాటుమండలంలోని అన్ని గ్రామాల్లోఘనంగా బోనాల పండగ ను జరుపుకొన్నారు. ప్రతి యేటా ఆషాడ మాసంలో ఆదివారం నిర్వహించుకొనే ఈ గ్రామ దేవతల బోనాల పండగను ఆనందోత్సవాల మధ్య జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మెండోరా గ్రామంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు గ్రామాలకు నలువైపుల కొలువై ఉన్న గ్రామదేవతలకు బోనాలు సమర్పించి,ప్రత్యేక పూజలు నిర్వహించి బలి ప్రధానం చేశారు.ఇందులో భాగంగా గ్రామదేవతలైన పెద్దపోచమ్మ, పెద్దమ్మ తల్లి, ఐదు చేతుల పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవారు, తాత ఆయి అమ్మవారు, నల్ల పోచమ్మ తల్లి, మత్తడి పోచమ్మ, ముత్యాలమ్మ ఇలా అన్ని గ్రామ దేవతలకు బోనాల పండుగ సందర్భంగా బోనాలు సమర్పించి, నైవేద్యంగా మేకలు, కోళ్ళు, గోర్లలను బలి ఇచ్చారు. ఈ విధంగా గ్రామ దేవతలకు జంతు బలి ప్రధానం చేయడం ద్వార గ్రామంలో పాడి,పంటలు బాగా ఉండి, పంటలు బాగా పండాలని, మనుషులకు, జంతువులకు అంటువ్యాధులు ప్రబలకుండా, అరాచకాలు జరగకుండా చూడాలని ప్రార్థిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ బోనాల పండగ గ్రామ కమిటీ పెద్దలు, కుల సంఘాల పెద్దల ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంటువ్యాధుల నుండి కాపాడాలని , వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని పూజలు నిర్వహించారు. అనంతరం మెండోరా తదితర గ్రామాల్లోని ప్రజలు కుటుంబ సమేతంగా వనభోజనాలలోవెళ్లి ప్రకృతి దేవత ఒడిలో సహా పంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలోమెండోరా గ్రామకమిటీ అధ్యక్షులు గౌరురాజన్న, ఉపాధ్యక్షులు గుడిసె సాయిబాబా, కోశాధికారి గంగారెడ్డి, డిసిసి కార్యదర్శి కుంట రమేష్, ఐకెపి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగారెడ్డి వివిధ కుల సంఘాల పెద్ద మనుషుల, ప్రజలు పాల్గొన్నారు.