- మాజీ మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ కోసమేనని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించడమే కాదు వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. రాష్ట్ర సంపదను కాపాడే భాద్యత కూడా బీఆర్ఎస్ దేనన్నారు. రాష్ట్రం లో పౌరసరఫరాల శాఖలో కుంభ కోణం జరిగిందని, ఈ కుంభ కోణం పై ఎన్ని సార్లు రకరకాల ఏజెన్సీలకు పిర్యాదు చేసినా స్పందన లేదని తెలిపారు. చివరకు కోర్టుకు కూడా బీఆర్ఎస్ వెళ్ళిందని తెలిపారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మి ఏడు వేల 600 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు. ఈ టెండర్లలో మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు 90 రోజులు గడువు విధించారని తెలిపారు. ఇప్పటికే 605 రోజులు పూర్తయినా ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. క్వింటాల్ కు 2007 రూపాయలు ధర నిర్ణయించగా 2230 రూపాయలు టెండర్లు దక్కించుకున్న వాళ్ళు మిల్లర్ల నుంచి వసూల్ చేశారని తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల మేర కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దలకు ముడుపుల రూపం లో అందించారని ఆరోపించారు. ఇప్పటివరకు సగం ధాన్యమే అమ్మారని, గడువు ముగిసినా టెండర్లు ఇప్పటి వరకు రద్దు చేయలేదని అన్నారు. బిడ్డర్లు కట్టిన డబ్బును తిరిగి చెల్లించే ప్రయత్నం జరుగుతోందని, ఈ అక్రమాల పై అసెంబ్లీ వేదిగ్గా కూడా ప్రశ్నించామని తెలిపారు. హై కోర్టు లో పిటిషన్ వేస్తె 15 సార్లు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించినా ప్రభుత్వం దాఖలు చేయలేదన్నారు. ప్రభుత్వానికి జమ చేయాల్సిన సొమ్ము జమ చేయనందుకు బిడ్డర్ల పై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారిని కాపాడుతున్నారన్నారు. అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని తెలిపారు. ఈ అంశం పై వచ్చే సోమవారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి పిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్ని విచారణ సంస్థలు ఉన్నాయో అన్నిటికి పిర్యాదు చేస్తామన్నారు. ఈ అంశం పై బండి సంజయ్ ,కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ లు సివిల్ సప్లై కుంభ కోణం లో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈ విషయమై ఎంత దూరమైనా వెళతామని తెలిపారు. ఇది భారత దేశం లోనే అతి పెద్ద కుంభ కోణమని తెలిపారు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం పై ఇస్తున్న పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ కు మాకు ఆహ్వానం లేదని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలుగా మారుస్తున్నారన్నారు. మా నేత హరీష్ రావు ను పిలిస్తే అందరికీ అర్థమయ్యేలా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇస్తారని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, నోముల భగత్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్ వై .సతీష్ రెడ్డి పాల్గొన్నారు.
