కామారెడ్డి జిల్లా రామారెడ్డి సమీపంలో ఘటన
కామారెడ్డి, బతుకమ్మ : ప్రమాదవశాత్తు రెండు లారీలు ఢీకొన్నాయి. ఈఘటన శుక్రవారం అర్ధరాత్రి కామారెడ్డి జిల్లా రామారెడ్డి సమీపంలో జరిగింది. ఈప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నుంచి సిద్దిపేట వెళ్లాల్సిన ఓ లారీ డ్రైవర్ పొరపాటున రామారెడ్డి బైపాస్ వంతెన నుంచి సర్వీస్ రోడ్డులోకి వెళ్లాడు.. వెంటనే తప్పుదారిలో వెళ్తున్నామని గుర్తించి బైపాస్ పైకి లారీని మళ్లించాడు. అదే సమయంలో వెనుక నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఈ లారీని ఢీకొంది. దీంతో హైదరాబాద్ వెళ్తున్న లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని మధ్యప్రదేశ్ కు చెందిన ఓంకారం పార్తీ(33) గా గుర్తించారు. గాయపడ్డ మరో ఇద్దరిని ప్రస్తుతం కామారెడ్డి జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
