24 C
Hyderabad
Sunday, August 2, 2026

జూలై 17న తలపెట్టిన రైల్ రోకోకు కామ్రేడ్ల మద్దతు కోరిన కవిత

Must read

📰 Generate e-Paper Clip

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో ఎమ్మెల్సీ కవిత భేటీ

 

 

హైదరాబాద్, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై జూలై 17న చేపట్టనున్న రైల్ రోకో కార్యక్రమానికి కామ్రేడ్లు మద్ధతివ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు. సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ ముఖ్య నాయకులు వెంకటేశ్వరరావు, చలపతి రావు, గోవర్ధన్ తో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  ‘‘కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం గత రెండేళ్లుగా ఉద్యమిస్తున్నాం. అందులో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు మూడు నెలల క్రితమే వెళ్లినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోంది. ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ చేసినా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మెదీతో ఈ అంశంపై మాట్లాడకపోవడం శోచనీయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలంటే ఉద్యమబాటనే మార్గం. జూలై 17న రైల్ వ్యవస్థను స్థంభించే విధంగా రైల్ రోకో చేపట్టబోతున్నాం. కలిసివచ్చే భావసారుప్యతగల శక్తులన్నింటినీ మద్ధతు కోసం కలుస్తున్నాం. ఉద్యమాలకు పేరెన్నికగల సీపీఎం పార్టీ నాయకులను కూడా కలిశాం. బిల్లు ఆలస్యమైతే బీసీలు ఉద్యోగులు, విద్యార్థులు రిజర్వేషన్లలో వాటాను కోల్పోతారు’’ అని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ ‘‘బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఉద్యమానికి సీపీఎం సంపూర్ణ మద్ధతిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్. సామాజిక న్యాయం కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కృషి అభినందనీయం. రిజర్వేషన్లను పెంచి అసమానతలను తొలగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. బీజేపీ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంటుంది. మొన్నటి వరకు కులగణనను కూడా బీజేపీ పార్టీ వ్యతిరేకించింది. ప్రజా ఉద్యమాలకు తలొగ్గి కులగణన చేయడానికి ముందుకొచ్చింది. రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర బీజేపీ నాయకులు నోరువిప్పడం లేదు. 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తడి చేసే బాధ్యత బీజేపీ నాయకులపై కూడా ఉంది. కేవలం కేంద్రానికి వినతి పత్రాలు అందించే వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం కావద్దు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లాలి.

  • తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి..

జిల్లా కలక్టరేట్లలో మార్చిన తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి అని మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. కాంగ్రెస్ తల్లి విగ్రహాలను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తీసేసి గాంధీ భవన్ కు పంపిస్తామని తెలిపారు.  మార్చిన తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రజలు ఆమోదించడం లేదన్నారు.

 

More articles

Latest article