27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి
  • మెండోరా తహసీల్ కార్యాలయం సందర్శన

 

నిజామాబాద్, బతుకమ్మ :  భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని కలెక్టర్ టి . వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. జక్రాన్పల్లి మండలం కేష్పల్లి లో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారా? అని అధికారులను ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు రాయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్‌డెస్క్, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సాంకేతిక అంశాలను జాగ్రత్తగా గమనించాలని,  సమస్యల వారీగా అర్జీలను   విభజిస్తూ, పక్కాగా రికార్డులలో పొందుపర్చాలని అన్నారు. ఎలాంటి వివాదాలు లేని తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే  పరిష్కరించాలని అన్నారు.  సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్ధమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులను పదేపదే తిప్పుకోకూడదని, సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ బృందాలకు హితవు పలికారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ రెవెన్యూ సదస్సులు ముగిసిన మీదట క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా చూడాలన్నారు. అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పని చేయాలని, అప్పుడే భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ అన్నారు.

  • మెండోరా తహసీల్ కార్యాలయం సందర్శన..

అనంతరం కలెక్టర్ మెండోరా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద మెండోరా మండలంలోని ఎనిమిది గ్రామాలలో రెవెన్యూ సదస్సుల ద్వారా సేకరించిన దరఖాస్తులను పరిష్కరిస్తున్న తీరును కలెక్టర్ అడిగి తెలుసుకుని, రికార్డులను పరిశీలించారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు అందించే అవకాశం లభించని వారి నుంచి కూడా భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకోవాలని, అన్ని అర్జీలు పరిష్కరించిన మీదట భూ సంబంధిత సమస్యలు మళ్లీ తెర పైకి రాకూడదని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్లు కిరణ్మయి, సంతోష్ రెడ్డి, సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Revenue conferences aimed at resolving land issues

More articles

Latest article