29 C
Hyderabad
Monday, August 3, 2026

భూ భారతిలో సర్వేయర్ల పాత్ర కీలకం

Must read

📰 Generate e-Paper Clip

శిక్షణ పొంది రైతులకు సేవలందించాలి

లైసెన్స్డ్‌ సర్వేయర్ల శిక్షణ తరగతుల్లో నిజామాబాద్‌ కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి

బతుకమ్మ, నిజామాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో లైసెన్స్డ్‌ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైసెన్స్డ్‌ సర్వేయర్ల కోసం ఎంపికైన అభ్యర్థులకు అందిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్‌ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అనుభవజ్ఞుల ద్వారా అందిస్తున్న సర్వే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మానవ జీవితంలో ప్రతిఒక్కరికీ భూములకు సంబంధించిన అంశం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గట్టు తగాదాలు లేకుండా ఉండేందుకు హద్దులను పక్కాగా నిర్ధారిస్తూ సర్వే మ్యాప్‌ లను పాస్‌ బుక్కులలో పొందుపర్చాలని నిర్ణయించిందని చెప్పారు. ప్రభుత్వ సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు లైసెన్స్డ్‌ సర్వేయర్ల సేవలను వినియోగించునేందుకు శిక్షణ ఇప్పిస్తోందని తెలిపారు.
భూముల క్రయవిక్రయాలు, సక్సేషన్‌ వంటి వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో భూముల సర్వే జరిపి మ్యాప్‌లను రూపొందించాల్సి ఉంటుందన్నారు. లైసెన్స్డ్‌ సర్వేయర్లకు గెట్టు, భూమి హద్దులు, రెవెన్యూ చట్టాలు, హక్కులు తదితర అంశాలపై థియరీ క్లాసులతోపాటు క్షేత్రస్థాయిలో చెయిన్‌ సర్వే, మ్యాప్‌ రీడిరగ్‌ వంటి వాటిలో అందిస్తున్న శిక్షణను చక్కగా నేర్చుకుంటే మంచి ఆదాయ వనరుతో పాటు చక్కటి గుర్తింపు పొందవచ్చని సూచించారు. భూ సంబంధిత సమస్యలలో అత్యధికంగా సర్వేతో ముడిపడిన అంశాలే ఎక్కువగా ఉన్నందున లైసెన్సుడ్‌ సర్వేయర్లు చక్కగా సేవలందిస్తే, అనేక భూ సమస్యల దరఖాస్తులు పరిష్కారం అవుతాయని, తద్వారా భూ వివాదాలకు తావు లేకుండా చేయాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుందని అన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ఏమాత్రం సంశయానికి లోను కాకుండా వాటిని నివృత్తి చేసుకోవాలని సూచించారు. 50 రోజుల పని దినాలలో కొనసాగే శిక్షణ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులతో పాటు తాను కూడా ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తానని అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోను కాకుండా బాధ్యతలు నిర్వర్తించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన ఎంతో ముఖ్యమని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జూలై 28, 29 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను నిర్వహిస్తుందని, ఈ పరీక్షలో నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులు అయిన వారికి లైసెన్సుడ్‌ సర్వేయర్లుగా ప్రభుత్వం గుర్తింపు పత్రాలను జారీ చేస్తుందని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ వెంట సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏ.డీ అశోక్‌, సిబ్బంది ఉన్నారు.

The role of surveyors is crucial in Bhu Bharati.

More articles

Latest article