- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ : కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బుధవారం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గోదావరి నీళ్లను ఒడిసి పట్టి నెర్రెలు బారిన తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా నోటీసులు ఇవ్వడంపై ఆమె మహాధర్నాకు పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి తలపెట్టిన మహా ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి కేసీఆర్ అభిమానులు, జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలిపారు. ప్రాణహిత – చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది.. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలు.. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టడంతో ఏటా యాసంగి సీజన్ లో రైతాంగానికి జరుగుతోన్న నష్టం.. కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తోన్న క్షుద్ర రాజకీయాలపై ధర్నాలో వక్తలు మాట్లాడనున్నారు.
